11 మంది సీఐఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్

11 మంది సీఐఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్

ఎయిర్ పోర్టులకు ర‌క్ష‌ణ క‌ల్పించే సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ జ‌వాన్లు క‌రోనా బారిన‌ప‌డ్డారు. ముంబై ఎయిర్ పోర్టులో 11 మంది జ‌వాన్ల‌కు వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. అంత‌ర్జాతీయ ప్ర‌యాణీకుల ద్వారా ఈ వైర‌స్ భార‌త్ లోకి ప్ర‌వేశించిన నేప‌థ్యంలో గ‌త నెల చివ‌రిలో అన్ని ర‌కాల విమాన స‌ర్వీసుల‌ను నిలిపేసిన త‌ర్వాత విమానాశ్ర‌యాల్లో విధులు నిర్వ‌హించిన సీఐఎస్ఎఫ్ జ‌వాన్ల‌ను 14 రోజుల క్వారంటైన్ కు పంపారు అధికారులు.

ముంబై ఎయిర్ పోర్టులో కొద్ది రోజులుగా క్వారంటైన్ లో ఉన్న 142 మంది సీఐఎస్ఎఫ్ జ‌వాన్ల‌లో ప‌లువురికి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డంతో టెస్టులు చేస్తున్నారు. గురువారం న‌లుగురికి వైర‌స్ ఉన్న‌ట్లు తేలగా.. మ‌రో ఏడుగురికి ఇవాళ క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని సీఐఎస్ఎఫ్ ఉన్న‌తాధికారులు తెలిపారు. అయితే ఒక జ‌వానుకు తొలి సారి టెస్టు చేసిన‌ప్పుడు పాజిటివ్ రాగా.. రెండోసారి ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్ వ‌చ్చింద‌ని చెప్పారు. దీంతో ఆ జవాన్ నుంచి మ‌రోసారి శాంపిల్స్ సేక‌రించి టెస్టుల‌కు పంపామ‌ని, రిజ‌ల్ట్ తెలియాల్సి ఉంద‌ని వివ‌రించారు.