ఆడుకుంటూ వెళ్లి ఎస్సారెస్పీ కాల్వలో బాలిక గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

ఆడుకుంటూ వెళ్లి ఎస్సారెస్పీ కాల్వలో బాలిక గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
  •     జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో విషాదం

కోరుట్ల,వెలుగు:  ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఎస్పారెస్పీ కాలువలో పడిన విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్​పల్లి టౌన్ లో  గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి లోని అయ్యప్ప ఆలయం ప్రాంతంలో ఎస్పారెస్పీ కాల్వకు ఆనుకొని కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. జోజి బాబు,- సుజాత దంపతుల కూతురు సంజన (11), చొప్పదండిలోని ఓ స్కూల్​ లో 5వ తరగతి చదువుతుండగా.. కొద్దిరోజుల కింద ఇంటికి వచ్చింది. 

గురువారం ఎస్పారెస్పీ కాల్వలో బట్టలు ఉతకడానికి తల్లి సుజాతతో కూతురు సంజన కూడా వెళ్లింది. సంజన ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాల్వలో  పడి గల్లంతైంది. సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి సీఐ అనిల్​కుమార్, ఎస్ఐ కిరణ్​కుమర్​ సిబ్బందితో వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆచూకీ దొరకలేదు.

కృష్ణానదిలో యువకుడు..

కొల్లాపూర్: ప్రమాదవశాత్తు కృష్ణ నదిలో యువకుడు గల్లంతైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.  గ్రామస్తులు, ఫ్రెండ్స్ తెలిపిన మేరకు.. గురువారం హైదరాబాద్ నుంచి నలుగురు ఫ్రెండ్స్ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకునేందుకు సరదాగా సోమశిల పుణ్యక్షేత్రానికి వెళ్లారు. కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద సాయంత్రం కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు అశోక్ (33) గల్లంతు అయ్యాడు. 

అశోక్ ఒక్కడే పుట్టి వేసుకుని నదిలోకి వెళ్లాడని, తమను రమ్మంటే వెళ్లలేదని మిగతా ఫ్రెండ్స్ తెలిపారు.  గ్రామస్తులు, అతనితోపాటు వచ్చిన ఫ్రెండ్స్ బోటుపై వెళ్లి నదిలో ఎంత వెతికినా అశోక్ ఆచూకీ దొరకలేదు.