111జీవో రద్దు ఎందుకోసం.. ఎవరి కోసం ?

111జీవో రద్దు ఎందుకోసం.. ఎవరి కోసం ?
  • నేతలు, బడాబాబుల చేతుల్లోనే 80 వేల ఎకరాలు
  • నాడు తక్కువ రేట్లకే భూములు అమ్ముకున్న రైతులు
  • ఇప్పుడు లక్షల కోట్ల రియల్​ దందా 
  • అసెంబ్లీలో ప్రకటనకు ముందే భూములపై కేసీఆర్​కు సర్వే రిపోర్ట్!​

హైదరాబాద్, వెలుగు: జీవో 111ను ఎత్తేస్తామని సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించిన అనంతరం ఆ జీవో పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. రియల్​ ఎస్టేట్​ హంగామా షురూ అయింది. ఎక్కడ చూసినా భూములు పరిశీలిస్తున్నవాళ్లతో సందడి కనిపిస్తున్నది. అయితే, ఈ జీవో రద్దుతో నిజానికి ఎవరికి ప్రయోజనం? రైతులు నిజంగా లాభపడతారా? వాళ్ల భూములకు రేట్లు వస్తాయా? వాళ్ల దగ్గర ఇప్పుడున్న భూమి ఎంత? అని పరిశీలిస్తే అంతా ఉత్తదేనని స్పష్టమవుతున్నది. ప్రస్తుతం అక్కడ దాదాపు 70శాతం భూములు రాజకీయ నేతలు, అధికారులు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల చేతుల్లో ఉంది. జీవో రద్దుతో వారికే ప్రయోజనం చేకూరుతుందని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్​ చెప్పినట్లు ఈ జీవో పరిధిలో లక్షా 32 వేల ఎకరాల్లో భూములు ఉండగా.. ఆ భూముల్లో 80వేల ఎకరాలు లీడర్లు, బడాబాబుల చేతుల్లోనే ఉన్నట్లు అంచనా. ఈ ప్రాంతంలో ఎవరికి ఎంత మొత్తం భూమి ఉందనే లెక్క కూడా సర్కారు చేతుల్లో ఉందని, భూముల లెక్కపై సర్వే పూర్తయిన తర్వాతే అసెంబ్లీలో ప్రకటన వెలువడిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. లక్షల రూపాయలకు ఎకరా చొప్పున రైతులు నాడు అమ్ముకున్న భూములు.. ఇప్పుడు బడాబాబుల చేతుల్లో ఉన్నాయి. ఆ భూములు కోట్లకు కోట్లు పలుకుతున్నాయి. సీఎం ప్రకటన వెలువడిన రాత్రికి రాత్రి భూముల ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. దీన్ని చూసి అక్కడి రైతులే ఆశ్చర్యపోతున్నారు. 
బడాబాబుల చేతుల్లోనే..!
111 జీవో పరిధిలో ఏడు మండలాల్లోని 84 గ్రామాలు ఉన్నాయి. హైదరాబాద్​ చుట్టుపక్కల రియల్​ ఎస్టేట్​ వ్యాపారం విస్తరిస్తున్న క్రమంలో ఇక్కడి రైతులు దశాబ్దం కింద తమ భూములను రెండు మూడు లక్షలకు ఎకరం చొప్పున అమ్ముకున్నారు. 1996లో  111 జీవోను తెచ్చారు.  అక్కడ ఉస్మాన్​ సాగర్​, హిమాయత్​ సాగర్​ జంట జలాశయాలు ఉన్నందున ఈ జీవో పరిధిలోని ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పకుండా 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రైతులు మంచి ధరల కోసం ఎదురు చూడకుండా భూములు అమ్ముకున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే రేట్లు పెరగకపోతాయా అని ఎదురుచూస్తూ వచ్చారు.  2007లో రియల్​ బూమ్​ సమయంలో కూడా జీవోను ఎత్తివేస్తారని ప్రచారం జరిగింది. దాంతో మరికొంత కాలం ఓపిక పట్టారు. 
కానీ అది ఎంతకూ తెగకపోవడంతో రైతులు వచ్చిన కాడికి భూములు అమ్మేశారు. తెలంగాణ వచ్చాక జీవో ఎత్తివేస్తారని కూడా చాలా కాలం ప్రచారం జరిగింది. 2018 డిసెంబర్​ 2న చేవెళ్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్​ మొదటిసారి ఈ జీవోను ఎత్తి వేస్తామని ప్రకటించారు. తర్వాత కొద్దికాలానికే 2019 ఏప్రిల్​లో లోక్​సభ ఎన్నికల సమయంలోనూ ఇదే హామీని రిపీట్​ చేశారు. దాని తర్వాత కొందరు నేతలు, అధికారులు రంగంలోకి దిగి వేల ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేశారు. భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాంతో లక్షా 32 వేల ఎకరాల్లో 80 వేల ఎకరాలు బడాబాబుల చేతుల్లోకి  చేరింది. ఎకరా ధర రెండు కోట్ల నుంచి 40 కోట్ల దాకా పెరిగిపోయింది. రైతుల చేతుల్లో 35, 40 వేల ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అక్కడి నాయకులు చెప్తున్నారు. ఇందులో ఎక్కువగా రెండు నుంచి ఐదెకరాల కమతాలు, మధ్య తరగతి జనం కొనుగోలు చేసిన ప్లాట్లు ఉన్నాయి. 
రాత్రికి రాత్రి భూముల ధరలకు రెక్కలు
సీఎం కేసీఆర్​ ప్రకటన చేసిన తెల్లారే అంటే బుధవారం ఉదయమే 111 జీవో  ప్రాంత గ్రామాల్లోని రియల్​ హడావుడి చూస్తే అక్కడి భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో అర్థమైపోయింది. వందల ఎకరాల ఫామ్​హౌస్​ల నడుమ అక్కడక్కడ రైతులకు రెండు నుంచి ఐదెకరాల చొప్పున భూములు ఉన్నాయి. చిన్న చిన్న రియల్టర్​ లు కూడా రెండు, మూడు ఎకరాలు కొనిపెట్టుకున్నారు. సీఎం స్టేట్​మెంట్​ తర్వాత భూములు చూసేందుకు వచ్చిన వారికి ‘‘పక్కనే ఫలానా లీడర్​ది 150 ఎకరాల ఫామ్​హౌస్​ ఉంది. 450 ఎకరాల భూమిని ఈ మధ్యనే ఒక మంత్రి కొనుగోలు చేశారు’’  అని చెప్తూ తమ భూముల బేరాలు మొదలుపెట్టడం కనిపించింది. రెండు కోట్లకు ఎకరా చొప్పున భూమి కొన్న ఒక చిన్న రియల్టర్​ ఇప్పుడు ధర ఎంత చెప్పాలో అర్థం కాక భూమి చూడడానికి వచ్చిన వాళ్లకు ఎక్కడో ఒక దగ్గర తెగుతుందని రూ. 10 కోట్లు కోట్​ చేశారు. ఒక ప్రముఖ విద్యా సంస్థ తన స్థలంలో నిర్మాణాలు చేపడితే కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు ఆ మధ్య వాటిని నిలిపేశారు. దీంతో ఆ సంస్థ.. మొన్నామధ్య రూ. రెండు కోట్లకు ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టింది. ఆ భూమి కొనేద్దామని ఒక బడా రియల్టర్​ ​ ఆ విద్యా సంస్థ వాళ్లకు బుధవారం ఫోన్​ చేస్తే.. ఎకరా ఎనిమిది కోట్లు చెప్పినట్లు తెలిసింది. ఇటీవల కోకాపేట్​లో ఎకరా 40 కోట్లకు హెచ్​ఎండీఏ  వేలం వేసింది. అందులో 111​ జీవో పరిధిలోకి వచ్చే భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎకరా 70 కోట్లకు చేరుతుందని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. 
ఇంకా అనుమానాలే..
కేసీఆర్​ ప్రకటనతో బడాబాబులు, రియల్టర్​ లు సంతోషంగా ఉన్నా.. రైతుల్లో మాత్రం ఇంకా అనుమానాలు నెలకొన్నాయి. కొన్ని గ్రామాల సర్పంచులు కూడా అపనమ్మకంతో ఉన్నారు. 111 జీవో గురించి గతంలో ఎందరో నేతలు ఇదే విధంగా హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. వైఎస్​ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా జీవో ఎత్తివేసే విషయంలో సానుకూలత ప్రదర్శించారు. కేసీఆర్​ కూడా హామీ ఇచ్చిన మూడేండ్లకు అసెంబ్లీ నుంచి ప్రకటన చేశారు. అయితే జీవో పూర్తిగా రద్దవుతుందా, వేరే రూపంలో మళ్లీ కొన్ని నిబంధనలతో ముందుకు వస్తుందా.. అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణవేత్తలు మాత్రం జీవోను పూర్తిగా రద్దు చేయడం అసాధ్యం అంటున్నారు. కొన్ని మార్పులు చేసే ఆస్కారం ఉందని చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు ఎంత వరకు నిబంధనలను సడలించగలుగుతుందనేది  తేలాల్సి ఉంది. నిపుణుల కమిటీ వేశామని, అది వచ్చాక జీవో ఎత్తేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించినా.. అందులో ఎలాంటి మార్పులు చేయాలనే విషయంలో సర్కారు ఇప్పటికే ఒక ప్లాన్​ రూపొందించుకున్నట్లు తెలుస్తున్నది.  
క్రమంగా పెరిగిన భూముల ధరలు 
తెలంగాణ రాక ముందు 111 జీవో పరిధిలోని భూముల ధర రూ. 30 లక్షలకు ఎకరం ఉండగా, తెలంగాణ వచ్చిన తర్వాత జీవో రద్దు చేస్తామంటూ మంత్రులు  ఆశపెట్టడంతో మూడు నాలుగేండ్ల కిందటి వరకు ఎకరం ధర రూ. 60 లక్షల వరకు అయింది. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో  సీఎం కేసీఆర్​ రెండు సార్లు  జీవో గురించి మాట్లాడటంతో ఆ రెండు సార్లు రేట్లు పెరిగాయి. రోడ్డు వైపు రూ. 4 కోట్లకు ఎకరం, లోపల అయితే రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు అయింది. కొద్దిరోజుల నుంచి రోడ్డువైపు రూ.6 కోట్ల నుంచి 8  కోట్ల వరకు ఎకరం పోతున్నది. అజీజ్​నగర్​ ప్రాంతంలో అయితే రూ.10 కోట్ల వరకు ఉంది.  
గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది
నిజానికి 111​ జీవో ఎత్తివేసే అవసరం లేదు.  జీవో ముట్టుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2000లో ఇండస్ట్రీస్​ ఏర్పాటుకు ప్రయత్నిస్తే అప్పట్లో పర్యావరణవేత్త  ఎంవీ నాయుడు సుప్రీంకోర్టును  ఆశ్రయించడంతో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పునిచ్చింది. ఇప్పుడు జరుగుతున్న తంతు రాజకీయ ప్రయోజనం కోసమే చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజలు వీటిని నమ్మొద్దు.  రియల్ ఎస్టేట్  లాబీయింగ్ కోసం పర్యావరణాన్ని, భవిష్యత్ తరాల ప్రయోజనాన్ని పణంగా పెట్టడం సరికాదు. హుస్సేన్ సాగర్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ జంట జలాశయాల విషయంలో జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.  - ప్రొఫెసర్  కె. పురుషోత్తం రెడ్డి, పర్యావరణవేత్త 
చెరువులను ధ్వంసం చేస్తే భూగర్భ జలాలు ఇంకిపోతయ్‌‌
ఉస్మాన్‌‌సాగర్‌‌, హిమాయత్‌‌ సాగర్ పరిరక్షణ కోసం 1996లో జీవో 111 తెచ్చారు. ఈ జీవో పరిధిలో లక్ష ఎకరాలు ఉన్నాయి. వరదల నివారణకు జంట జలాశయాలు కట్టారు. ఎన్జీటీ ఇచ్చిన సూచనల మేరకు రెండు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఇప్పుడు 90శాతం బఫర్‌‌ జోన్‌‌, 10శాతం ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నాం. చెరువులను ధ్వంసం చేయకూడదు. ఇట్ల చేస్తే భూగర్భజలాలు ఇంకిపోతాయి. కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తదో కూడా ఇంకా తెలియదు. - చిరంజీవులు, రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ 
111 జీవో ఉండటంతో మాఫియా ముట్టుకోలే..
సమైక్యాంధ్రలో 111 జీవో తెచ్చారంటున్నరు. అప్పుడు జీవో తేవడంతోనే హైదరాబాద్‌‌ ప్రశాంతంగా ఉంది. మాఫియా అటు వైపు పోలే. ఫారెస్ట్‌‌ యాక్ట్‌‌ ఉన్న దగ్గర ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం ఉండదు. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. జీవో 111లో కూడా మినహాయింపులు ఉన్నాయి. హైదరాబాద్‌‌ ఏమైనా పర్లేదన్న ధోరణిలో జీవో ఎత్తేస్తున్నట్లు ఉంది.  - శ్రవణ్‌‌ కుమార్‌‌, సుప్రీంకోర్టు అడ్వకేట్‌‌
రియల్‌‌ ఎస్టేట్‌‌ మాఫియా కోసమే రద్దు
జీవో 111 రద్దుతో భవిష్యత్‌‌లో కోటి మందికి నష్టం జరుగుతుంది. రెండు జలాశయాలు పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. డెవలప్‌‌మెంట్‌‌తోపాటు చెరువులు కూడా ముఖ్యమే. నిపుణుల కమిటీ రిపోర్ట్ రాకుండానే రద్దు చేస్తామని కేసీఆర్‌‌ చెప్పడం ఏమిటి? పెట్టుబడిదారులకు బెనిఫిట్‌‌ చేసేలా ప్రభుత్వ తీరు ఉంది. 84 గ్రామాల్లో ఎవరి భూములు ఉన్నాయో చూడాలి. జన్వాడలో కన్‌‌స్ట్రక్షన్స్‌‌ అవుతున్నాయని వందల కేసులు నమోదయ్యాయి. మంత్రి కేటీఆర్‌‌ కడుతున్నారని పీసీసీ చీఫ్‌‌  కేసు వేశారు. మాఫియా లీడర్లు పేదల దగ్గర అదిరించి, బెదిరించి భూములు లాక్కున్నారు. జీవో రద్దు చేస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మాత్రమే కాకుండా  మూసీ నది, నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తిగా కలుషితమవుతాయి.  - దాసోజు శ్రవణ్‌‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి
వరద నీళ్లన్నీ ఎటుపోవాలే..
హైదరాబాద్‌‌ సమతుల్యం రోజురోజుకు దెబ్బతింటున్నది. 111 జీవో రద్దు చేస్తే కట్టడాలు కట్టాక వరద నీళ్లన్నీ ఎటు పోతయ్​?  మున్సిపల్‌‌ శాఖ మంత్రి కేటీఆరే నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. దీనిపై క్షేత్రస్థాయిలో చర్చ జరగాలి. వచ్చే నష్టాలను లిస్ట్‌‌ ఔట్‌‌ చేయాలి. దీని పరిధిలో ఎంత మంది ఉన్నారో తేలాలి. - ఎన్‌‌వీఎస్‌‌ఎస్‌‌ ప్రభాకర్‌‌, బీజేపీ నేత
అక్కడ అన్నీ రిసార్టులు, ఫామ్​హౌస్​లు, వెంచర్లు
111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో 25 కుపైగా రిసార్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి 1,200  నుంచి 1,500 ఎకరాల భూములు ఉన్నాయి.  మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్​ కాలేజీలు 30 వరకు ఉన్నాయి. ఇవి 600 ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్నాయి.  వేల ఎకరాల్లో 400 నుంచి 500 ఫామ్​హౌస్​లు ఉన్నాయి. జీవో పరిధిలోని గ్రామాల్లో వంద  క్రికెట్​ గ్రౌండ్​లు ఉంటాయి. ఇవి ఒక్కోటి నాలుగు నుంచి ఐదు ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. రెండు నుంచి ఐదు ఎకరాల పరిధిలో వెయ్యికి పైగా వెంచర్లు కూడా ఉన్నాయి. వీటిలో విల్లాలు నిర్మిస్తున్నారు. 
111 జీవో ఉద్దేశం ఇదీ...!
111 జీవోను 1996లో తీసుకువచ్చారు. జీవో పరిధిలోని ప్రాంతాల్లో వ్యవసాయం తప్ప అక్కడ ఏ రంగానికి కూడా భూమిని కేటాయించడానికి వీలులేదు. ఉస్మాన్​సాగర్​, హిమాయత్​సాగర్​ జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారక స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో జీ ప్లస్ టు నిర్మాణాలకు మించి కట్టడాలు చేపట్టేందుకు  వీల్లేదు. క్యాచ్​మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో 60 శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90 శాతం కన్సర్వేషన్ కోసం కేటాయించాలి.