
హైదరాబాద్, వెలుగు : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సులకు ప్రస్తుతం ఆదరణ కరువైంది. వాటిని చదివేందుకు స్టూడెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పటి వరకూ కేవలం 1152 మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. అయితే, డైట్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గడానికి గత బీఆర్ఎస్ సర్కారు కూడా కారణమేనని అధికారులు, స్టూడెంట్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు.
6 నెలలకు అడ్మిషన్ల ప్రక్రియ
రాష్ట్రంలో 2023–24 నాటికి తొమ్మిది సర్కారు డైట్ (టీటీసీ) కాలేజీలు, 45 ప్రైవేటు కాలేజీలున్నాయి. వాటిలో అడ్మిషన్ల కోసం గతేడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం డీఈఈసెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్1న ఎగ్జామ్ జరిగితే, డిసెంబర్ లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. డీఈఈసెట్‌కు 6,485 మంది అప్లై చేసుకుంటే, దాంట్లో 5,150 మంది ఎగ్జామ్ రాశారు. 3,975 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 2,689 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహించడంతో కేవలం 1,728 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 1152 మంది కాలేజీల్లో జాయిన్ అయ్యారు. డైట్ కాలేజీల్లో ఇంత తక్కువ అడ్మిషన్లు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. గత సర్కారు డైట్ అడ్మిషన్లను నిర్లక్ష్యం చేసిందని స్టూడెంట్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. చాలా ప్రైవేటు కాలేజీలూ మూతపడగా, ఈ ఏడాది హైదరాబాద్ లోని గవర్నమెంట్ కాలేజీలోనూ అడ్మిషన్లకు ఎన్సీటీఈ అనుమతి ఇవ్వలేదు.
నేటి నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్
డీఈఈసెట్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. 17న సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని, 18 నుంచి 22 వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాస్‌చారి తెలిపారు. 25న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని చెప్పారు. సీట్లు పొందిన స్టూడెంట్లు ఈ నెల 29లోగా కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు.