పోలింగ్‌‌కు దూరంగా గంగుల, చెన్నమనేని

పోలింగ్‌‌కు దూరంగా గంగుల, చెన్నమనేని

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌‌లో 117 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బిల్డింగ్‌‌లోని ఫస్ట్‌‌ ఫ్లోర్‌‌లో స్ట్రాంగ్‌‌ రూంను ఎలక్షన్‌‌ అబ్జర్వర్‌‌ కృష్ణకుమార్‌‌ ద్వివేది, ఎలక్షన్‌‌ ఏజెంట్లు రఘునందన్‌‌రావు, మహేశ్వర్‌‌ రెడ్డి సమక్షంలో ఎన్నికల అధికారులు ఓపెన్‌‌ చేశారు. ఉదయం 10కి కమిటీ హాల్‌‌ -1లో ఏర్పాటు చేసిన పోలింగ్‌‌ స్టేషన్‌‌లో ఓటింగ్‌‌ షురూ చేశారు. మొదట టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అంతకుముందు టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, మంత్రి కేటీఆర్‌‌ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకే ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎలా ఓటు వేయాలనేది వారికి కేటీఆర్‌‌ వివరించారు. ఎమ్మెల్యేలందరూ అక్కడే బ్రేక్‌‌ఫాస్ట్‌‌ చేసి బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు.

గంటన్నరలోనే 80 మంది
రాష్ట్రపతి ఎన్నికల్లో మొదట మంత్రి కేటీఆర్‌‌ ఓటు వేశారు. ఆయనతో పాటు మంత్రులు, సుమారు 80 మంది ఎమ్మెల్యేలు మొదటి గంటన్నరలోనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం పర్యటించిన సీఎం కేసీఆర్‌‌.. హనుమకొండ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌‌కు బయల్దేరారు. మధ్యాహ్నం 1.35కు అసెంబ్లీకి చేరుకొని ఓటు వేశారు. సీఎంతో పాటు స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌ రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌‌ పద్మారావు గౌడ్‌‌, మంత్రులు ప్రశాంత్‌‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌‌ కుమార్‌‌ ఓటేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలంతా ఒకేసారి వచ్చి ఓటు వేశారు.

చెల్లుబాటయ్యే రీతిలోనే ఓటేసిన: సీతక్క
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌‌బాబు, సీతక్క, పోదెం వీరయ్య ఒకేసారి ఓటు వేశారు. సీతక్క ఓటు వేస్తున్న క్రమంలో హైడ్రామా జరిగింది. బ్యాలెట్‌‌ పేపర్‌‌లో ఓటు నమోదు చేస్తున్నప్పుడు ఇంక్‌‌ పడిందని చెప్తూ మరో బ్యాలెట్‌‌ పేపర్‌‌ ఇవ్వాలని ఆమె ఎన్నికల అధికారులను అడిగారు. అయితే ఆఫీసర్లు మరో బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదు. దీంతో అదే బ్యాలెట్‌‌ పేపర్‌‌పై సీతక్క తన ఓటు వేసి బాక్స్‌‌లో వేశారు. ఆమె కాంగ్రెస్‌‌ బలపరిచిన యశ్వంత్‌‌ సిన్హాకు కాకుండా ఎన్‌‌డీఏ అభ్యర్థికి ఓటేశారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని సీతక్క ఖండించారు. తాను ఓటు వేస్తున్న క్రమంలో బ్యాలెట్‌‌ పేపర్‌‌పై ఇంక్‌‌ పడింది కాబట్టే రెండో బ్యాలెట్‌‌ అడిగాను తప్ప ముర్ముకు ఓటు వేయలేదన్నారు. బ్యాలెట్‌‌ పేపర్‌‌పై పడిన ఇంక్‌‌ను చేతితో రబ్‌‌ చేశానని, తాను పార్టీ బలపరిచిన అభ్యర్థికి, చెల్లుబాటు అయ్యే రీతిలోనే ఓటు వేశానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌‌, రఘునందన్‌‌ రావు ఉదయం, ఈటల రాజేందర్‌‌ మధ్యాహ్నం ఓటు వేశారు. మధ్యాహ్నం 12.50కి కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌‌ రెడ్డి , చివరగా జగ్గారెడ్డి వచ్చి ఓటు వేశారు.

ఇయ్యాల ఢిల్లీకి బ్యాలెట్ బాక్సులు
అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కరోనాతో ఐసోలేషన్‌‌లో ఉన్న మంత్రి గంగుల కమలాకర్‌‌, జర్మనీలో ఉన్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌‌ తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఏపీకి చెందిన ఎమ్మెల్యే ఎం.మహీధర్‌‌ రెడ్డి ముందే ఇక్కడ ఆప్షన్‌‌ ఇచ్చుకోవడంతో వచ్చి ఓటు వేశారు. పోలింగ్‌‌  తర్వాత ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌‌ బాక్స్‌‌కు సీల్‌‌ వేసి స్ట్రాంగ్‌‌ రూమ్‌‌లో భద్రపరిచారు. మంగళవారం ఉదయం శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు తరలించి, ఉదయం 6.40 గంటల ఫ్లైట్‌‌కు ఢిల్లీకి పంపిస్తారు.