పార్టీ మారి 13 మంది గెలిచిన్రు

పార్టీ మారి 13 మంది గెలిచిన్రు
  •     బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన 12 మంది విక్టరీ

హైదరాబాద్, వెలుగు : చాలా మంది అభ్యర్థులు తమ భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకుని పార్టీలు మారారు. తామున్న పార్టీ గెలవదని కొందరు.. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మరికొందరు.. చెప్పిందొకటి చేసిందొకటని మరికొందరు.. వివిధ కారణాలతో పార్టీలు మారి టికెట్లు దక్కించుకున్నారు. అలా పార్టీలు మారి 13 మంది విజయం సాధించారు. అందులో 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులే ఉండగా.. ఒకరు బీజేపీ క్యాండిడేట్. ఒకరిద్దరు మినహా దాదాపు అందరు అభ్యర్థులు భారీ మెజారిటీతోనే విజయం సాధించారు. టికెట్ల చివరి జాబితాను ప్రకటించే ఆఖరు నిమిషంలో బీజేపీని వీడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్​లో చేరారు.

పార్టీ ఆయనకే మునుగోడు టికెట్ పార్టీ కన్ఫర్మ్ చేయగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి భారీ విజయాన్ని సాధించారు. భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెండు నెలల్లోనే కాంగ్రెస్ నుంచి బీఆర్​ఎస్​కు అటునుంచి మళ్లీ కాంగ్రెస్​లోకి వచ్చి బరిలో నిలిచారు. ఆయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్ రెడ్డిపై 26,201 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నారాయణపేటలో కసిరెడ్డి నారాయణ రెడ్డి

బీఆర్ఎస్​ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి.. కాంగ్రెస్​లో చేరి కల్వకుర్తి టికెట్ దక్కించుకున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 5,410 ఓట్ల మెజారిటీతో గెలిచారు. చివరి నిమిషంలో కాంగ్రెస్​ పార్టీలో చేరిన వేముల వీరేశం.. నకిరేకల్​లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను 68,839 ఓట్ల భారీ తేడాతో మట్టికరిపించారు. సత్తుపల్లి టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరిన మట్టా దయానంద్​.. తనకు టికెట్ దక్కకపోవడంతో తన భార్య మట్టా రాగమయికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై గెలుపొందారు.

సీనియర్లు సూపర్​..

బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చిన సీనియర్ నేతలు, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఖమ్మం నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర రావు.. మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌ని ఓడించారు. కొల్లాపూర్ నుంచి బరిలోకి దిగిన జూపల్లి కృష్ణారావు.. బీరం హర్షవర్ధన్ రెడ్డిపై 29,931 ఓట్ల తేడాతో గెలుపొందారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నుంచి పోటీ చేసి..

సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై భారీ విజయాన్ని నమోదు చేశారు. వివేక్ వెంకటస్వామి.. బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరారు. చెన్నూరు టికెట్ దక్కించుకున్న ఆయన బాల్క సుమన్​పై 37,515 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. మహబూబ్​నగర్ టికెట్ దక్కించుకుని మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను ఓడించారు. 

మరికొందరు నేతలిలా..

తన తండ్రి మైనంపల్లి హన్మంతరావుతో పాటు కాంగ్రెస్​లోకి వచ్చిన మైనంపల్లి రోహిత్​.. మెదక్​లో పద్మా దేవేందర్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చిన రేవూరి ప్రకాశ్​ రెడ్డి.. పరకాల నుంచి పోటీ చేసి చల్లా ధర్మారెడ్డిని ఓడించారు. కాంగ్రెస్​ను వీడిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ నుంచి నిర్మల్ అభ్యర్థిగా పోటీ చేశారు. మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డిని ఓడించారు.