బతుకమ్మ సంబురాలకు 12 కోట్లు.. జిల్లాకు రూ.30 లక్షలు.. మిగతా నిధులు గ్రేటర్ హైదరాబాద్కు

బతుకమ్మ సంబురాలకు 12 కోట్లు.. జిల్లాకు రూ.30 లక్షలు.. మిగతా నిధులు గ్రేటర్ హైదరాబాద్కు
  • నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు.. ఈ నెల 21 నుంచి 30 వరకు పూల పండుగ
  •     తొలిరోజు వరంగల్​లోని వేయి స్తంభాల గుడిలో సంబురాలు ప్రారంభం
  •     గిన్నిస్​బుక్ రికార్డే లక్ష్యంగా 28న ఎల్బీ స్టేడియంలో 10 వేల మందితో వేడుకలు


హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఇందుకోసం రూ.12 కోట్ల నిధులను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రతి జిల్లాకు రూ.30 లక్షల చొప్పున నిధులు కేటాయించనుండగా.. మిగిలిన నిధులను గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే వేడుకలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

కాగా, ఈ నెల 21 నుంచి 30 వరకు తొమ్మిది రోజులపాటు  పూల పండుగ జరగనున్నది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలిచే వరంగల్‌‌‌‌‌‌‌‌లోని వేయి స్తంభాల గుడిలో ఈ నెల 21వ తేదీన బతుకమ్మ సంబురాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో భారీ వేడుక

తెలంగాణ సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పాలన్న సంకల్పంతో ఈ సారి బతుకమ్మ సంబురాలను ఘనంగా జరిపేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎల్బీ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో స్థానం సంపాదించేలా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఈ సంబురాలను నిర్వహించనున్నది. 

ఇందులో స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని 30 సర్కిళ్ల నుంచి మహిళలను తరలించేందుకు 150 బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే మహిళలకు ప్రత్యేక ట్యాగ్‌‌‌‌‌‌‌‌లు కేటాయించనున్నారు. గిన్నిస్ రికార్డు సాధనకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చీరల పంపిణీ,కళాఖండాల ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్.. 

బతుకమ్మ వేడుకలు పురస్కరించుకొని  గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని 11 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించనున్నారు. 27న హైదరాబాద్​లో ​ట్యాంక్ బండ్ వద్ద ఈవెనింగ్ బతుకమ్మ కార్నివాల్, హుస్సేన్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌లో ‘ఫ్లోటింగ్ బతుకమ్మ’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. 

29న పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, ఫ్లోరల్ హోలీ, 28న బతుకమ్మ సైకిల్ రైడ్, 29న ​మహిళల బైకర్స్ రైడ్, 30న ​విన్టేజ్ కార్ ర్యాలీ  నిర్వహించనున్నారు. 30న ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్ వద్ద గ్రాండ్ పూల పండుగ నిర్వహించనున్నారు. తెలంగాణ చేతివృత్తుల కళాఖండాల ప్రదర్శన, నెక్లెస్ రోడ్డులో మూడు రోజుల పాటు తెలంగాణ వంటకాలతో స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయనున్నారు.