తుఫాన్ బీభత్సం.. బెంగాల్​లో 12 మంది మృతి

తుఫాన్ బీభత్సం.. బెంగాల్​లో 12 మంది మృతి

న్యూఢిల్లీ: అంఫాన్ తుఫాను పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ల మధ్య తుఫాను తీరం దాటడంలో కోల్​కతాలో భారీ ఈదురుగాలులతో కుండపోతగా వర్షం పడింది. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు హుగ్లీ, హవ్​డా, మిడ్నాపూర్, 24 పరగణా జిల్లాలను కుదిపేశాయి. కోల్‌కతాలో బలమైన గాలుల ధాటికి చెట్లు, కరెంటు స్లంభాలు నేలకూలి వాహనాలు, ఇండ్లు దెబ్బతిన్నాయి. కరెంటు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయక సిటీలో చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. తుఫాన్ ప్రభావాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. బుధవారం రాత్రంతా సచివాలయంలోని కంట్రోల్ రూమ్ లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ.. అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పటివరకు ఈ సూపర్ సైక్లోన్ ఎఫెక్టుతో రాష్ట్రంలో 12 మంది చనిపోయారని మమతా బెనర్జీ తెలిపారు. అత్యంత తీవ్రం తుఫానుగా మారిన అంఫాన్ వేలాది మందిని నిరాశ్రయులను చేసిందన్నారు. బలంగా గాలులు వీయడంతో రెండు జిల్లాలు అతలాకుతలం అయ్యాయన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కంటే అంఫాన్ తుఫాను ప్రభావం దారుణంగా ఉందని, రూ. 1 లక్ష కోట్ల వరకు నష్టం కలిగి ఉండవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఆ ప్రాంతం సర్వనాశనం అయింది. కమ్యూనికేషన్లు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. విపరీతంగా వర్షం పడుతున్నందుకు కొన్ని ప్రాంతలకు అధికారులు చేరుకోలేకపోయారు”అని మమతా అన్నారు.

తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారనుందని, ఆ తర్వాత బలహీన పడుతుందని ఇండియన్ మెట్రోలజికల్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. పెను తుఫాను గడిచిన ఆరు గంటల్లో 30 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి.. బంగ్లాదేశ్ పై సైక్లోనిక్ తుఫానుగా కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారి, ఆ తర్వాత బలహీన పడుతుందని చెప్పారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ మాట్లాడుతూ ‘‘ఈ తుఫాను అత్యంత ఘోరమైన విపత్తు” అని అన్నారు. ప్రమాదాల బారిన పడి చనిపోయిన వారిపట్ల విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.