బీరుట్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని ఒక ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 12 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దక్షిణ లెబనాన్‌లోని బింత్ జ్బెయిల్ జిల్లాలో ఉన్న 'బుర్జ్ కలావియా' గ్రామంలోని ఆరోగ్య కేంద్రంపై శుక్రవారం అర్థరాత్రి ఈ దాడి జరిగింది. తమ విధుల్లో నిమగ్నమై ఉన్న వైద్య బృందంపై ఒక్కసారిగా బాంబుల వర్షం కురవడంతో అక్కడికక్కడే 12 మంది మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని, రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు తెలిపారు.
అంతకుముందు జరిగిన మరో దాడిలో ఇద్దరు పారామెడికల్ సిబ్బంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. కాగా, లెబనాన్‌పై దాడులు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 26 మంది పారామెడిక్స్ మరణించగా, 51 మంది గాయపడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్న అంబులెన్స్ సిబ్బందిని సైతం ఇజ్రాయెల్ సైన్యం పదేపదే లక్ష్యంగా చేసుకుంటోందని లెబనాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
