
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్తయారీలో మనదేశాన్ని చైనాకు దీటుగా నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో స్కీమును రెడీ చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకోసిస్టమ్‌ను ఇండియాలో అభివృద్ధి చేయడానికి ఇన్సెంటివ్ స్కీమును ప్రకటించనుంది. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు, సర్వర్ల వంటి వాటి తయారీని ప్రోత్సహించడానికి దాదాపు రూ. 10వేల కోట్ల నుంచి రూ. 12వేల కోట్ల వరకు రాయితీలు ఇవ్వనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచడానికి, యాపిల్ వంటి గ్లోబల్ కంపెనీ లను ఆకర్షించడానికి ఈ పథకం మరింత సహాయపడుతుందని ఎక్స్పర్టులు అంటున్నారు. “విడిభాగాల ఉత్పత్తిపైనా ఇన్సెంటివ్స్ను ఈ పథకం ఇస్తుంది. అలాగే ప్లాంట్ల ఏర్పాటుకు క్యాపిటల్ సపోర్ట్‌ను అందించే అవకాశం ఉంది. పథకం తుది రూపురేఖలు ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి) నాటికి పాలసీని రెడీగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం”అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారు. హైటెక్ కాంపొనెంట్స్ తయారీ కోసం చైనీస్ సంస్థలతో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటుకు కూడా అనుమతి ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఇది భారతదేశంలో తయారీని మరింత విస్తరించడానికి, యాపిల్వంటి కంపెనీలు ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి వీలు కల్పిస్తుంది. తైవాన్, కొరియా జపాన్ వంటి దేశాల్లోని కంపెనీలను ఇక్కడికి తరలించడానికి లేదా కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి కాంపోనెంట్స్కీమ్ సాయపడుతుంది. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఈ స్కీమ్ ఎంతో ముఖ్యమైనదిగా మారనుంది. ఎందుకంటే రూ. 3,285 కోట్లతో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సెమీకండక్టర్ల (ఎస్పీఈసీఎస్) తయారీని ప్రోత్సహించడానికి చేపట్టిన పథకం 2023 మార్చి నాటికి ముగుస్తుంది. స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రొడక్షన్ -లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని గత ఏప్రిల్‌లో ప్రారంభించారు. ఇది మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది. దీనికింద కంపెనీలకు రూ.41 వేల కోట్ల విలువైన రాయితీలు ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ భాగాలు కెమెరా మాడ్యూల్స్, వైబ్రేటర్ మోటార్లు, డిస్‌ప్లే అసెంబ్లీలు, టచ్ ప్యానెల్‌లు వంటి సబ్–-అసెంబ్లీల వంటి వాటి తయారీని ప్రోత్సహించడం ఎస్పీఈసీఎస్ టార్గెట్. స్కీములో పేర్కొన్న మూలధన వస్తువుల తయారీకి కూడా ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) లెక్కల ప్రకారం.. ఈ ప్లాన్‌తో ఇప్పటి వరకు దాదాపు రూ. 12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఎస్పీఈసీఎస్ను పొడగించాలె..
విడిభాగాల తయారీకి మద్దతుగా కనీసం రూ. 10వేల కోట్ల బడ్జెట్‌తో ఎస్పీఈసీఎస్ను మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ఐటీ హార్డ్‌వేర్ కోసం చైనాపై భారీగా ఆధారపడుతున్న కారణంగా ఫినిషిడ్ గూడ్స్, సబ్‌అసెంబ్లీల వంటి భాగాల సరఫరాకు టైర్-2, -3 తయారీదారులు కీలకం. వీళ్లు లేకుండా గ్లోబల్సప్లై చెయిన్‌లో ఇండియా దూసుకుపోవడం సాధ్యం కాదని ఐసియా అంటోంది. 2026 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీని సాధించడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 18 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలూ ఉంటాయి. వియత్నాం వంటి ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ తయారీ రంగం బలహీనంగానే ఉంది. ఖర్చులు, లాజిస్టిక్స్, కరెంటు వంటి ఖర్చులు ఇప్పటికీ 10--–14శాతం ఎక్కువ. ఈ దేశాలతో పోటీపడాలంటే ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు అవసరమని పరిశ్రమ చెబుతోంది. స్థానికంగా విడిభాగాలను ఉత్పత్తి చేసినప్పుడే ఎలక్ట్రానిక్స్ తయారీకి విజయవంతమైన ఇకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందని ఎక్స్పర్టులు అంటున్నారు. ఐటీ హార్డ్‌వేర్ తయారీకి సంబంధించి ఇప్పటికే ఉన్న పీఎల్ఐ పథకాలు కూడా లోకలైజేషన్‌ను ఎంకరేజ్ చేస్తున్నాయి. విడిభాగాల తయారీ సంస్థలకు లాభదాయకంగా ఉండటానికి, చైనా సంస్థలు ఏదైనా భారతీయ కంపెనీతో జాయింట్ వెంచర్‌తో వస్తే వాటికీ అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చైనాతో పాటు, హైటెక్ ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ సంస్థలతో జాయింట్ వెంచర్లను ప్రోత్సహించాలని కోరుకుంటోంది. ఇటువంటి వెంచర్ల ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీలోకి ప్రవేశించగల భారతీయ కంపెనీలను గుర్తించడానికి పరిశ్రమతో కలసి కేంద్రం త్వరలో కసరత్తు ప్రారంభించనుంది.