కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను మరింత ముందుకు తీసుకెళ్లాలని తాజాగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలా చేయడం వల్ల జాతీయ ప్రయోజనాలు దెబ్బతినవని స్పష్టంగా తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవ ముగింపు సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. 1969లో జరిగిన బ్యాంకుల జాతీయం అనుకున్నంత మేలు చేయలేకపోయిందని వ్యాఖ్యానించారు.
జాతీయీకరణ వల్ల ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్య రంగాలకు రుణసదుపాయం వంటి కార్యక్రమాలకు ఊతమొచ్చింది. అయితే ప్రభుత్వ నియంత్రణలో వ్యవస్థ అనర్హంగా, అప్రొఫెషనల్‌గా మారిందని సీతారామన్ చెప్పారు. 50 ఏళ్ల జాతీయీకరణ తర్వాత కూడా లక్ష్యాలు సరిగా నెరవేరలేదని చెప్పుకొచ్చారు ఆర్థిక మంత్రి. కానీ బ్యాంకులను ప్రొఫెషనల్‌గా నిర్వహించడం ప్రారంభించిన తర్వాత వాటి లక్ష్యాలు మరింత ఫలవంతంగా నెరవేరుతున్నాయన్నారు.
ప్రైవేటీకరణతో సామాజిక లక్ష్యాలు సడలిపోతాయని ఉన్న అభిప్రాయాన్ని ఖండిస్తూ ఆమె.. బ్యాంకులు ప్రొఫెషనల్‌గా మారినా లేదా ప్రైవేటు రంగంలోకి వెళ్లినా, ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యం దెబ్బతింటుందనే మాట సరైంది కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొన్న ‘ట్విన్ బెలెన్స్ షీట్’ సమస్యను ప్రస్థావించారు. 2012–13లో ఏర్పడిన ఆర్థిక సమస్యలను సరిదిద్దడానికి తాము చాలా కాలం కష్టపడాల్సి వచ్చిందన్నారు.
బోర్డు ఆధారిత నిర్ణయాలతో నడిచే ప్రొఫెషనల్ బ్యాంకులు జాతీయ ప్రయోజనాలను, వ్యాపార ప్రయోజనాలను సమర్థవంతంగా సాధించగలవని ఆమె అన్నారు. అయితే నిర్మలమ్మ వ్యాఖ్యలపై బ్యాంకు యూనియన్లు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే దేశానికి విస్తృత స్థాయి బ్యాంకింగ్ సేవలను అందించగలిగాయని, ప్రజలు పెద్ద స్థాయిలో జన్ ధన్ అకౌంట్లు తెరవడం, రైతులకు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రుణ సదుపాయాలు కల్పించడం వంటివి వీరి ద్వారానే సాధ్యమైందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజెన్ నగర్ పేర్కొన్నారు.
