అధిక వడ్డీ ఇస్తామంటూ 330 కోట్ల మోసం

అధిక వడ్డీ ఇస్తామంటూ 330 కోట్ల మోసం
  • బోర్డు తిప్పేసిన 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ 
  • నల్గొండలో డైరెక్టర్ ఇంటి ఎదుట బాధితుల ఆందోళన 

నల్గొండ, వెలుగు: అధిక వడ్డీ చెల్లిస్తామంటూ జనాన్ని నమ్మించి ఓ కంపెనీ రూ.330 కోట్లు మోసం చేసింది. దీంతో బాధితులు నల్గొండలో కంపెనీ డైరెక్టర్ ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన రాపోలు ప్రకాశ్​తోపాటు మరో 12 మంది కలిసి హైదరాబాద్ మియాపూర్ లో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నామని, రూ.100కి రూ.4 వడ్డీ ఇస్తామని ప్రచారం చేశారు. 

రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే నెలనెలా వడ్డీ ఇస్తూ షూరిటీ కింద కుంట భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. 20 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తీసుకొని రూ.4 లక్షలు తిరిగి ఇస్తానని నమ్మించారు. హైదరాబాద్, నల్లొండ పరిసర ప్రాంతాల్లో 360 మంది బాధితులు రూ.330 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. ఇటీవల నెలనెలా ఇచ్చే వడ్డీ ఇవ్వకపోవడంతో డైరెక్టర్లకు ఫోన్లు చేశారు. వాళ్లు ఎత్తకపోవడంతో సోమవారం నల్గొండలోని రాపోలు ప్రకాశ్​ఇంటి ముందు ఆందోళన చేశారు. నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు బాధితులతో మాట్లాడి డైరెక్టర్ రాపోల్ ప్రకాశ్​ను స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. ఈ విషయంపై నల్గొండ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు బాధితులు వెల్లడించారు.