పిల్లాడి కోసం ఒకరి వెంట మరొకరు.. చెరువులో మునిగి నలుగురు మృతి

పిల్లాడి కోసం ఒకరి వెంట మరొకరు.. చెరువులో మునిగి నలుగురు మృతి
  • మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో విషాదం
  • మృతుల్లో తల్లీ కొడుకు, బంధువులు

మనోహరాబాద్, వెలుగు : చెరువులో ఆడుకుంటున్న 12 ఏండ్ల బాలుడు గల్లంతు కాగా.. అతన్ని కాపాడేందుకు ఒకరి తర్వాత ఒకరు వెళ్లిన ముగ్గురు మహిళలూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో సోమవారం జరిగింది. ఆదివారం గ్రామంలో బోనాల పండుగ జరుపుకున్నారు. గ్రామానికి చెందిన బీరంగి చంద్రయ్య, లక్ష్మి దంపతులు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్​పేటలో ఉండే తమ బంధువులను పండుగకు ఆహ్వానించారు. 

లక్ష్మి తమ్ముళ్ల భార్యలైన దుడ్డోళ్ల లక్ష్మి, దుడ్డోళ్ల బాలమణి, ఆమె కొడుకు చరణ్ ఆదివారమే రంగాయిపల్లి వచ్చారు. అందరూ కలిసి బోనాల పండుగ జరుపుకున్నారు. సోమవారం ఉదయం బట్టలు ఉతికేందుకని లక్ష్మి కూతురు లావణ్య (21), దుడ్డోళ్ల బాలమణి (30), దుడ్డోళ్ల లక్ష్మి (32) గ్రామ శివారులోని చెరువుకు వెళ్లారు.

వారు బట్టలు ఉతికి స్నానం చేస్తుండగా.. వారితో పాటే వచ్చిన బాలమణి కొడుకు దుడ్డోళ్ల చరణ్ (12) చెరువులో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు చరణ్ మునిగిపోయాడు. ఇది గమనించిన లక్ష్మి.. చరణ్​ను కాపాడేందుకు వెళ్లింది. ఆమె కూడా నీట మునగడంతో వీరిని కాపాడేందుకు బాలమణి వెళ్లింది. ముగ్గురూ మునిగిపోతుండటంతో వాళ్లను కాపాడేందుకు లావణ్య వెళ్లింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి.. చివరికి నలుగురు మునిగిపోయారు. చుట్టుపక్క ఉన్నవాళ్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. 

వాళ్లు వచ్చి చెరువులో దిగి గాలించగా.. బాలమణి, లక్ష్మి, లావణ్య డెడ్​బాడీలు గుర్తించారు. చరణ్ మృతదేహం దొరకలేదు. తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సీఐ శ్రీధర్, మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా చరణ్ డెడ్​బాడీ దొరకలేదు. చెరువులో పూడిక బాగా ఉందని, చరణ్ డెడ్​బాడీ అందులో కూరుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు.

రెండు కుటుంబాల్లో విషాదం

ఇటు రంగాయిపల్లి, అటు అంబర్​పేట గ్రామాల్లో విషాదం నెలకొంది. రంగాయిపల్లికి చెందిన చంద్రయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. కూతురు లావణ్య చనిపోయింది. మృతులు బాలమణి, చరణ్, లక్ష్మి అంబర్​పేటలోని ఒకే కుటుంబానికి చెందినవారు. అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములైన ఏసయ్య, శ్రీకాంత్​లది ఉమ్మడి కుటుంబం. ఏసయ్య బస్ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య బాలమణి, కొడుకు చరణ్, కూతురు ఉన్నారు. ఈ ప్రమాదంలో భార్య, కొడుకు చనిపోయారు. శ్రీకాంత్, లక్ష్మి దంపతులకు ఒక కొడుకు.

 శ్రీకాంత్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొంత కాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. కొడుకు మానసిక పరిస్థితి బాగాలేదు. భార్య లక్ష్మి నీట మునిగిచనిపోయింది. ఈమె కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. విషయం తెలుసుకున్న మెదక్ జడ్పీ చైర్​పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఫారెస్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి రంగాయిపల్లి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.