సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ నిప్పురవ్వ

V6 Velugu Posted on Sep 26, 2021

బెదిరింపులకు లొంగలేదు, దెబ్బలకు జడువలేదు. లాటీలు, తూటాలను లెక్క చేయలేదు. భూమి నాది, పంట నాది మధ్యలో నీ పెత్తనమేందని.... దొరల అరాచకాలపై మాటల తూటాలు పేల్చిన వీర వణిత. మహిళల్లో చైతన్యం రగిల్చి... కూలీలు, రైతుల్ని ఏకతాటిపైకి తెచ్చిన మహా యోదురాలు. ఇవాళ చాకలి ఐలమ్మ 126వ జయంతి. 

చాకలి ఐలమ్మ......ఓ చరిత్ర. దున్నేవాడిదే భూమని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ నిప్పురవ్వ. ఈ వీరవణిత పేరు లేకుండా సాయిధ పోరాట చరిత్రే లేదు. ఎంతోమందిలో స్ఫూర్తి నింపి, చైతన్యాన్ని రగిలించింది. రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరూలూదింది. చాకలి ఐలమ్మది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యను పెళ్లి చేసుకుంది. నలుగురు కొడుకులు, ఓ కూతురు. భూమినే నమ్ముకున్న ఐలమ్మ... పాలకుర్తిలో మల్లంపల్లి భూస్వామి కొండలరావు దగ్గర 40ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. బహుజన కులానికి చెందిన ఐలమ్మ... దొరల భూమిని సాగు చేయడం పట్వారీ శేషగిరిరావుకు నచ్చలేదు. దీంతో ఐలమ్మను వేధించసాగాడు. కుటుంబంతో వచ్చి తనపొలంలో కూలీ చేయాలని హుకూం జారీ చేశాడు. పాలకుర్తిలో అప్పటికే ఆంధ్రమహాసభ ఏర్పడింది. నిజాం అరాచకాలు, దొరల అణచివేతలపై ఆంధ్రమహాసభ ప్రశ్నిస్తోంది. ఇందులో సభ్యురాలైన ఐలమ్మ పట్వారీ తాటాకు చప్పుళ్లకు బెదరలేదు.

విసినూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి... అరాచకాలకు పెట్టింది పేరు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అంతం చేసేవాడు. పట్వారీ శేషగిరిరావు ఐలమ్మ విషయాన్ని దేశ్ ముఖ్ కు చేరవేశాడు. విసినూర్ దేశ్ ముఖ్ ఆగడాలను ఆంధ్రమహాసభ అడ్డుకుంటూ వస్తోంది. ఐలమ్మ కూడా సభలో సభ్యురాలవడంతో.... కక్ష గట్టాడు. ఐలమ్మ కమ్యూనిస్టుల్లో చేరిందని దొంగ కేసులు పెట్టించాడు. ఐలమ్మ కొడుకులను అరెస్ట్ చేయించాడు. బెదిరింపులకు లొంగని ఐలమ్మ న్యాయ పోరాటం చేసిన దొరపై గెలిచింది. మొదటిసారి ఐలమ్మ నుంచి దొరకు సురుకు తగిలింది. సహించలేని విసినూర్ దొర.. ఐలమ్మ పొలాన్ని తనపేర రాయించుకున్నాడు. అయితే దొరను గానీ, దొర గుండాలను గానీ తన పొలాన్ని టచ్ చేయనివ్వలేదు ఐలమ్మ. పొలంలోని వడ్లను తీసుకునేందుకు వచ్చిన దొరగుండాలను ఆంధ్రమహాసంఘం సభ్యులతో కలిసి తరిమికొట్టింది. ధాన్యాన్ని ఇంటికి చేర్చింది. ఐలమ్మ చేతిలో రెండోసారి దెబ్బతిన్న విసినూర్ దొర రామచంద్రారెడ్డి ఈసారి మరింత క్రూరమైన పథకంతో వచ్చాడు. ఐలమ్మ చేతిలో ఓటమిని తట్టుకోలేని దేశ్ ముఖ్.. రజాకార్లతో పాలకుర్తిలో దాడులు చేయించాడు. ఐలమ్మ ఇంటిని తగలబెట్టించాడు. రజకార్లు ధాన్యం ఎత్తుకెళ్లారు. కూతురిపై లైంగికదాడి చేశారు. అడ్డొచ్చినవారిని చంపేశారు. ఆర్థికంగా దెబ్బతీసినా, కుటుంబాన్ని కూల్చేసినా... ఐలమ్మ అడుగు ముందుకే పడింది.

పోరాటంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగింది ఐలమ్మ. పట్వారీ శేషగిరిరావు ఇంటిని కూల్చేసింది. అక్కడే మక్కలు పండించింది. ఐలమ్మ తెగువ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. 90 ఎకరాల దొర భూమిని ప్రజలకు పంచారు. ఐయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు 4వేలమంది అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూపంపకం జరిగింది. 1985 సెప్టెంబర్ 10న చనిపోయింది ఐలమ్మ. ఇంతటి మహా పోరాట యోధురాలికి అటు సమైక్యపాలనలో గానీ, ఇటు ప్రత్యేక రాష్ట్రంలో గానీ గుర్తింపు దక్కలేదు. తెలంగాణ వచ్చిన ఏడేళ్లకు ప్రభుత్వానికి మొన్న చాకలి ఐలమ్మ గుర్తుకు వచ్చింది. ఈ ఏడాది నుంచి ఐలమ్మ, వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించింది. 

Tagged Telangana, 126th birth anniversary, Chakli Ailamma

Latest Videos

Subscribe Now

More News