బస్సు కాలి బూడిదవడానికి వందల ఫోన్లు పేలడమే కారణం.. ఫోరెన్సిక్ రిపోర్ట్తో బయటపడిన నిజం !

బస్సు కాలి బూడిదవడానికి వందల ఫోన్లు పేలడమే కారణం.. ఫోరెన్సిక్ రిపోర్ట్తో బయటపడిన నిజం !

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ కాలిబూడిదైన బస్సు ప్రమాద ఘటనపై ఫోరెన్సిక్ రిపోర్ట్ షాకింగ్ కు గురిచేస్తోంది. ఇప్పటి వరకు బస్సు దగ్ధమవడానికి కారణం బైక్ ను 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడం.. ఆ తర్వాత పెట్రోల్ లీక్ కావడమే కారణంగా భావించారు. కేవలం పెట్రోల్ లీక్ తో అంత తొందరగా బస్సంతా ఎలా తగలబడిపోయిందనే అనుమానాలూ ఉన్న క్రమంలో.. వందల కొద్ది ఫోన్లు పేలిపోవడమూ ఒక కారణంగా నివేదిక ద్వారా తెలుస్తోంది. 

బస్సు లగేజీ బాక్స్ లో ఉన్న 400 ఫోన్లు వరుసగా పేలడంతో.. ఒక చిన్నపాటి బ్లాస్ట్ సంభవించినట్లుగా ప్రమాద తీవ్రత పెరిగిందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. సెల్ ఫోన్ పార్సిల్ లో ఫోన్ల బ్యాటరీలు పేలడంతో బస్సులో మంటలు వెంటనే వ్యాపించాయని తేలింది. 

పెట్రోల్ ట్యాంక్ లీకవ్వడంతో ముందుగా లగ్యేజీ క్యాబిన్ అంటుకోవడం.. ఆ తర్వాత ఆ వేడికి ఫోన్లు పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. లగేజీ క్యాబిన్ పైన ఉన్న సీట్లు మొదట వెంటనే అంటుకున్నాయని.. దీంతో ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు తప్పించుకునేందుకు కూడా వీలు లేకుండా పోయిందని దర్యాప్తులో తేలింది. 

ఫోన్లు పేలడంతో బస్సు దిగిన డ్రైవర్.. ప్రయాణికులను లేపకుండా వెనకివైపు నుంచి పారిపోయాడు. మరోవైపు బస్సులో భారీగా మంటలు, పొగ కమ్మేయడంతో ప్రయాణికులకు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కొందరు సాహసం చేసి అద్దాలను పగలగొట్టి బయటపడగలిగారు. కొందరు పొగతో ఊపిరాడకా.. అలాగే సీట్లలోనే కాలి బూడిదయ్యారని రిపోర్టు ద్వారా తెలుస్తోంది. 

 హైదరాబాద్ నుంచి బెంగళూరు  వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఏపీ కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.  శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బస్సు మంటల్లో దగ్ధమైపోయింది. కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. 
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు.  19 మంది మృతి చెందగా మరో మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక  చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.