టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పదవులకు రాజీనామా

టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పదవులకు రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన వారి జాబితాలో వేం నరేందర్ రెడ్డి (పీఈసీ మెంబర్), ఎమ్మెల్యే సీతక్క(పీఈసీ మెంబర్), విజయ రమణారావు ( టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), దొమ్మాటి సాంబయ్య (టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), వజ్రేశ్ యాదవ్ (టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్), చారగొండ వెంకటేశ్ (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), సత్తు మల్లేశ్ (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), శశికళ యాదవ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), చిలుక మధుసూదన్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), పటేల్ రమేశ్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), సుభాష్ రెడ్డి (టీపీసీసీ జనరల్ సెక్రెటరీ), కవ్వంపల్లి సత్యనారాయణ (డీసీసీ ప్రెసిడెంట్ కరీంనగర్) ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ కు పంపారు. అయితే కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఈ నాయకులంతా  ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో సమావేశమవడం గమనార్హం. 

‘హాత్ సే హాత్ జోడో’ సమావేశం జరుగుతుండగా..

ఓ వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరాభవన్‭లో కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశం జరుగుతుండగా.. మరోవైపు 13 మంది నేతలు కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ఈ మీటింగ్ కు సీనియర్లు డుమ్మా కొట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ పై నిన్న నిరసన గళం వినిపించిన ఏ ఒక్కరు కూడా.. మీటింగ్‭కు హాజరుకాకపోవడం గమనార్హం.  ఏఐసీసీ ఆదేశాలతో జరుగుతున్న సమావేశానికి సీనియర్లు వస్తారని రేవంత్ వర్గం భావించింది. కానీ రేవంత్ ఆధ్వర్యంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్లు ముందుగా నిర్ణయించుకున్నట్లే.. ఇవాళ్టి సమావేశానికి రాలేదు.  కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో సన్నాహక సమావేశం రేవంత్, భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా.. భట్టి మీటింగ్‭కు రాలేదు. రేవంత్ ఒక్కరే సమావేశానికి వచ్చారు. మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అద్దంకి దయాకర్, మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు, ఫిరోజ్ ఖాన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.