ఆటిజం ఉన్నా ఈతలో టాప్​

ఆటిజం ఉన్నా ఈతలో టాప్​

చిన్నప్పటి నుంచి ఆటిజంతో బాధపడుతోంది. మాటలు కూడా సరిగా రావు. నలుగురిలో కలిసేది కాదు. ఆ సమస్య నుంచి కోలుకునేందుకు థెరపీలో భాగంగా ఈత నేర్చించారు డాక్టర్లు. దాంతో, చిన్నప్పటి నుంచే నీళ్లతో ఫ్రెండ్​షిప్​ చేసింది. ఇప్పుడు ఈత పోటీల్లో రికార్డులు సృష్టిస్తోంది. తన పేరు జియా రాయ్. ఈమధ్యే శ్రీలంక, ఇండియా మధ్య ఉన్న పాక్​ జలసంధిలో 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 10 నిమిషాల్లో ఈది రికార్డు సాధించింది. 

ఈ 13 ఏండ్ల  ఈ పారా స్విమ్మర్ గురించి... 
శ్రీలంకలోని తలైమన్నార్ దగ్గర ఈ ఆదివారం (మార్చి20న) ఉదయం 4:22 కు ఈత మొదలుపెట్టి, సాయంత్రం 5: 32కి మనదేశంలోని ధనుష్కొడి ప్రాంతానికి చేరుకుంది. ఈ స్విమ్మింగ్​ జర్నీలో జియాకు ఏ  ప్రమాదం జరగకుండా చూసుకున్నారు శ్రీలంక నేవీ, ఇండియన్ కోస్ట్​గార్డ్​ వాళ్లు. జియా రాయ్ తండ్రి మదన్​ రాయ్​ ఇండియన్ నేవీలో ఆఫీసర్. తల్లి రచన కెమిస్ట్రీ టీచర్. తమ కూతురికి ఆటిజం అని తెలియగానే మొదట్లో బాధపడ్డారు. డాక్టర్ల సలహాతో జియాకి స్విమ్మింగ్ నేర్పించారు. అప్పటినుంచి ఇంట్లో ఉన్నా, ప్లే స్కూల్లో ఉన్నా  నీళ్ల బకెట్​లో చేతులు పెట్టి ఆడుకునేది జియా. అలాంటిది తను స్విమ్మర్​ అవుతుందని పేరెంట్స్ ఊహించలేదు. అయితే, స్కూల్లో ఈత పోటీల్లో ఫస్ట్ వచ్చి, అందర్నీ ఆశ్చర్యపరిచింది జియా. దాంతో, కూతురు స్విమ్మింగ్​లో మరింత మెరుగుపడేందుకు కోచ్​ని పెట్టారు. 

తల్లి జాబ్​ మానేసి కోచ్​గా...
కోచ్ చెప్పే విషయాలు జియాకు తొందరగా అర్థం అయ్యేవి కావు. దాంతో కోచ్​ చెప్పినవి, కూతురికి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆమె తల్లి టీచర్​ జాబ్ మానేసింది. 2019లో గుజరాత్​లోని పోర్​బందర్​లో ‘నేషనల్ ఓపెన్ వాటర్​ సీ ఛాంపియన్​షిప్’ జరిగింది. అప్పుడు జియాకు పదేండ్లు.  ఆ పోటీల్లో 14 ఏండ్ల వాళ్లకే ఎంట్రీ ఉంది. అయితే, జియా స్విమ్మింగ్ స్కిల్స్ చూసి, స్పెషల్​ ఎంట్రీ ఇచ్చారు. 5 కిలోమీటర్ల పోటీలో ఫస్ట్ వచ్చింది జియా. పోయిన ఏడాది ఫిబ్రవరిలో ముంబైలోని బాంద్రా–వర్లీ మధ్య  36 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల 40 నిమిషాల్లో ఈదింది. ఈ ఫీట్​ సాధించిన మొదటి స్పెషల్​ చైల్డ్​గా రికార్డు సాధించింది జియా. 

24 గోల్డ్ మెడల్స్
గత మూడేండ్లలో నేషనల్​, స్టేట్ లెవల్​ స్విమ్మింగ్, ఓపెన్ వాటర్ సీ స్విమ్మింగ్ ఛాంపియన్​షిప్స్​లో 24 గోల్డ్​ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ గెలిచింది. మానసిక ఆరోగ్యం సరిగా లేకున్నా స్విమ్మింగ్​లో రాణిస్తున్న జియాకు ఈ ఏడాది ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం ఇచ్చారు. ప్రపంచంలోని ఏడు సముద్రాల్ని ఈదిన మొదటి పారా స్విమ్మర్​గా గుర్తింపు తెచ్చుకోవాలన్నది జియా కల అంటున్నాడు ఆమె తండ్రి మదన్​ రాయ్.