- మూడో విడత వేలంలో 8 ఎకరాలకు వెయ్యి కోట్ల ఆమ్దానీ
- 3 దశల్లో 27 ఎకరాలు అమ్మగా సర్కారుకు 3,708 కోట్ల ఆదాయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోకాపేటలో ఎకరా భూమి రూ.131 కోట్లు పలికింది. మరో ప్లాట్‌లో రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. బుధవారం హెచ్‌ఎండీఏ నిర్వహించిన మూడో విడత భూముల ఈ వేలం ముగిసింది. కోకాపేటలోని నియోపొలీస్ లే ఔట్‌లో ప్లాట్ నెంబర్ 19, 20ని ఈ వేలంలో అమ్మకానికి పెట్టగా, ప్లాట్ నెంబర్ 19లోని 4 ఎకరాల్లో ఎకరా131 కోట్లు పలికింది.
అలాగే, ప్లాట్ నెంబర్ 20 (4.04 ఎకరాలు)లో ఎకరానికి రూ.118 కోట్లు పలికింది. మొత్తం 8.04 ఎకరాల భూమి అమ్మేయగా హెచ్ఎండీఏకు రూ.1000 కోట్ల ఆదాయం వచ్చింది. హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటి వరకు ఈ వేలం ద్వారా మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలను వేలం వేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి 3.708 కోట్ల ఆమ్దానీ వచ్చింది.
బుధవారం జరిగిన వేలంలో ప్లాట్ నెంబర్ 19 ని యు అండ్ లా కన్స్ట్రక్షన్ ఎల్‌ఎల్‌పీ, గ్లోబల్ ఇన్‌ఫ్రాంకో ఎల్ఎల్‌పీ సంస్థలు దక్కించుకున్నాయి. ప్లాట్ నెంబర్ 20ని బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ దక్కించుకుంది. అయితే, గతంలో రెండు దశల్లో నిర్వహించిన వేలం కంటే ఈసారి కొంచెం ధర తక్కువే పలికినా.. ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అది ఆశించిన ఫలితమేనని అధికారులు తెలిపారు.
తాజా లెక్కల ప్రకారం నియో పోలీస్ ఏరియాలో సగటు ధర ఎకరానికి 137.36 కోట్లు అని అధికారులు తెలిపారు. నియోపోలీస్‌లో దశలవారీగా భూముల విలువ మారుతోంది. దీంతో డిసెంబర్ 5న నిర్వహించే గోల్డెన్ మైల్ వేలంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ వేలంలో కూడా రికార్డు స్థాయి ధర పలకొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ముసాపేట్ భూముల వేలం రద్దు: హెచ్ఎండీఏ
ఈ నెల 5న నిర్వహించనున్న మూసాపేటలోని 15 ఎకరాల భూముల వేలంను రద్దు చేస్తున్నట్టు హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, అదే రోజు రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఉన్న గోల్డెన్ మైల్ లోని భూములతో పాటు మూసాపేట్లో వై జంక్షన్ సమీపంలోని సర్వే నంబర్ 121,141,146,147,155,157లోని 15 ఎకరా ల భూములను వేలం వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల ముసాపేట భూములను వేలం వేయడం లేదని కమిషనర్ వెల్లడించారు. గోల్డెన్ మైల్ లోని 1.98 ఎకరాల భూమిని మాత్రమే వేలం వేయనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ముసాపేట్ భూములను వేలం వేయొద్దని ఓ ప్రజాప్రతినిధి నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే హెచ్ఎండీఏ అధికారులు ఈ భూములను వేలం నుంచి తొలగించినట్టు సమాచారం.
