
- వార్డుల డీలిమిటేషన్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు
- 56 మున్సిపాలిటీలపై కోర్టు కేసులు
- అవి తేలితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఎలక్షన్స్?
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆ శాఖ అధికారులు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రదర్శన, వార్డుల విభజనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 56 మున్సిపాలిటీల నుంచి 1,378 ఫిర్యాదులు రాగా వాటిని వెంటనే పరిష్కరించినట్లు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. వీటిలో వార్డుల డీలిమిటేషన్‌పైనే ఎక్కువ కంప్లయింట్స్ వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే 56 మున్సిపాలిటీలకు చెందిన స్థానిక నాయకులు, న్యాయవాదులు వార్డుల పునర్విభజనపై ఒకరి తర్వాత ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు పలు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియపై స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో జులై 31నాటికే ఎన్నికలను ముగించాలని ప్రభుత్వం భావించినప్పటికీ న్యాయపరమైన అడ్డంకులతో ఎన్నికలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే కేసులు ఉన్న మున్సిపాలిటీలను మినహాయించి, అభ్యంతరాల్లేని 69 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల హైకోర్టును కోరింది. మరోవైపు ఓటర్ల జాబితా తయారీ, వార్డుల డీలిమిటేషన్‌పై వచ్చిన ఫిర్యాదులన్నింటిని తాము పరిష్కరించామని, అందువల్ల అన్ని పిటిషన్లను ఒకేసారి విచారించి స్టేలు ఎత్తివేయాలని మున్సిపల్ అధికారులు కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
కేసులు క్లియరైతే వచ్చే నెలలో ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, పొరపాట్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారించనుంది. ఒకవేళ ఎన్నికల విషయంలో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మున్సిపల్ అధికారులు వార్డు/ డివిజన్, చైర్‌పర్సన్/ మేయర్ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసి జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయగానే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు జోనల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలైన్స్ టీమ్‌లు, పోలింగ్ సిబ్బంది నియామకాన్ని అధికారులు పూర్తి చేశారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ మొదటివారంలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.