
బెల్లంపల్లి, వెలుగు: ఫైనాన్స్ ఉన్న విషయం తెలియక సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకొని ఆర్థికంగా ఇబ్బంది కావడంతో మానసిక వేదనకు గురై యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం నెన్నెల మండలంలో జరిగింది. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగాల్‌పేట పంచాయతీలోని ఖర్జీ గ్రామానికి చెందిన యువతి అద్దెరపల్లి మమత(19) టెన్త్ వరకు చదువుకొని ఇంటి వద్దనే ఉంటోంది. ఉపాధి కోసం ఏడాది క్రితం రూ.1.60 లక్షలతో బెల్లంపల్లిలో సెకండ్ హ్యాండ్ ఆటో కొనుగోలు చేసి డ్రైవర్‌తో నడిపించుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటోంది.
అయితే ఆటోపై ఫైనాన్స్ ఉందనే విషయం తెలియక మమత ఆటో కొనుగోలు చేసింది. పాత ఓనర్ కిస్తీలు కట్టకపోవడంతో నెల రోజుల క్రితం ఫైనాన్స్ సిబ్బంది ఆటోను సీజ్‌చేసి తీసుకెళ్లారు. తాను మొత్తం డబ్బులు చెల్లించి ఆటో తీసుకున్నానని చెప్పినా వినకుండా ఫైనాన్స్ వారు తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైంది. అప్పటి నుంచి బాధపడుతూ ఉంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుంది. కుటుంబసభ్యులు సాయంత్రం వచ్చేసరికి లోపలి నుంచి తలుపు బెడంపెట్టి ఉంది. కిటికీలోంచి చూడగా మమత దూలానికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులకు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి నాగేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.