అగ్రికల్చర్ వర్సిటీ 55వ కాన్వొకేషన్ .. హాజరవుతున్న గవర్నర్, ఐకార్ డీజీ

అగ్రికల్చర్ వర్సిటీ 55వ కాన్వొకేషన్ .. హాజరవుతున్న  గవర్నర్, ఐకార్ డీజీ

హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్  వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ) 55వ స్నాతకోత్సవం శనివారం జరగనుంది. ఈ మేరకు శుక్రవారం వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధ్యక్షత వహించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగిస్తారు. 2021-~22 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన 830 మంది విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నారు. వీరిలో 690 మంది అండర్ గ్రాడ్యుయేట్, 154 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు. 

అలాగే, 30 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. వీసీ జానయ్య మాట్లాడుతూ..తాను బాధ్యతలు స్వీకరించినప్పుడు నాలుగు స్నాతకోత్సవాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో ఒకటి శనివారం నిర్వహిస్తున్నామని చెప్పారు. రానున్న నవంబర్‌లో 56, 57వ స్నాతకోత్సవాలను సంయుక్తంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించనున్నామని తెలిపారు. అలాగే, భారీ కిసాన్ మేళా నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, నాల్గవ పెండింగ్ స్నాతకోత్సవాన్ని 2026 మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు.

1966 నుంచి 2014 వరకు 32 వేల మంది యూజీ, 15 వేల మంది పీజీ, 9 వేల మంది పీహెచ్‌డీ పట్టాలు పొందారని జానయ్య తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 7 వ్యవసాయ కళాశాలలు, 1 కమ్యూనిటీ సైన్స్ కళాశాల, 2 వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు, 9 పాలిటెక్నిక్‌లు, 15 పరిశోధన కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలుగా మార్చిన డాట్ సెంటర్లు ఉన్నాయని వివరించారు.  సమావేశం అనంతరం రిజిస్ట్రార్ జీఈ చంద్ర విద్యాసాగర్‌తో కలిసి జానయ్య స్నాతకోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.