
హర్యానాలోని సరిహద్దు భద్రతా దళ అధికారి నుంచి పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటి నుంచి రూ. 14 కోట్ల నగదు, కోటి రూపాయల విలువైన ఆభరణాలు, ఒక బీఎండబ్ల్యూ కారు, మెర్సిడెస్ జీప్తో సహా ఏడు విలాసవంతమైన కార్లను గుర్తించారు. గుర్గావ్ జిల్లాలోని మనేసర్‌లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హెడ్‌క్వార్టర్స్ లో డిప్యూటీ కమాండెంట్ ప్రవీణ్ యాదవ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ఆఫీసర్‌గా ప్రజలను నమ్మించి రూ. 125 కోట్ల వరకు వసూళ్లు చేశాడని.. అందుకే ప్రవీణ్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ తో పాటు ఆయన భార్య మమతా యాదవ్, సోదరి రీతూ, సహచరుడిని కూడా అరెస్టు చేశారు.
NSG క్యాంపస్‌లో నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పిస్తానని ప్రజల నుంచి కోట్లాది రూపాయలను యాదవ్ తీసుకున్నాడు. మోసం చేసిన మొత్తం డబ్బును అతడు ఎన్‌ఎస్‌జీ పేరుతో నకిలీ ఖాతాకు బదిలీ చేశాడు. యాక్సిస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉన్న అతని సోదరి రీతూ యాదవ్ ఈ ఖాతాను తెరిచినట్లు పోలీసులు తెలిపారు. ‘ప్రవీణ్ యాదవ్ స్టాక్ మార్కెట్‌లో సుమారు రూ. 60 లక్షల నష్టాన్ని చవిచూశాడు. ఆ డబ్బును ప్రజలను మోసం చేయడం ద్వారా రికవరీ చేయాలని ప్లాన్ చేశాడు’ అని గుర్గావ్ పోలీస్ క్రైమ్ ACP ప్రీత్ పాల్ సింగ్ తెలిపారు.
పోలీసుల ప్రకారం.. యాదవ్ ఇటీవల అగర్తలాలో పోస్టింగ్ పొందాడు. అయితే ప్రజలను మోసం చేయడం ద్వారా యాదవ్ చాలా సంపదను కూడబెట్టాడు. దాంతో కొన్ని రోజుల క్రితం యాదవ్.. తన పదవికి కూడా రాజీనామా చేశాడు.
For More News..