140 కిలోల గంజాయి పట్టివేత

140 కిలోల గంజాయి పట్టివేత

మిర్యాలగూడ, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్‌‌టౌన్‌‌ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ శరత్‌‌ చంద్ర పవార్‌‌ శనివారం స్థానికంగా వెల్లడించారు. గంజాయి నియంత్రణలో భాగంగా డీఎస్పీ రాజశేఖరరాజు ఆధ్వర్యంలో పోలీసులు ఈ నెల 12న మిర్యాలగూడ పట్టణంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టణ శివారులో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను తనిఖీ చేసేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులను చూసి నలుగురు వ్యక్తులు పరార్‌‌ కాగా సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండలం లాల్‌‌సింగ్‌‌ తండాకు చెందిన ప్రైవేట్‌‌ ఉద్యోగి భూక్యా రామును పట్టుకున్నారు. అనంతరం కారులో తనిఖీ చేయగా రూ. 30 లక్షల విలువైన 140. 585 కేజీల గంజాయి దొరికింది. రామును అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి రవాణా విషయం బయటపడింది. సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్‌‌ మండలం బంజారాహిల్స్‌‌ కాలనీకి చెందిన నూనావత్‌‌ జగన్‌‌, జల్మాల్‌‌కుంట తండాకు చెందిన నూనావత్‌‌ మంచ్యానాయక్‌‌తో పాటు లాల్‌‌సింగ్‌‌ తండాకు చెందిన ఆంగోతు నాగరాజు, ఖమ్మం జిల్లా జూబ్లీపురకు చెందిన బాణోతు సాయి కలిసి కలసి హైదరాబాద్, మద్దిమడుగు ప్రాంతాల్లో గంజాయి కొని కార్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రామును రిమాండ్‌‌కు పంపించామని, మిగతా నలుగురిని సైతం పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్‌‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గంజాయితో పాటు బొలెరో, మేరాజ్‌‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ రాజశేఖరరాజు, వన్‌‌టౌన్‌‌, హాలియా సీఐలు సుధాకర్, జనార్ధన్‌‌, ఎస్సైలు సతీశ్‌‌, రవి పాల్గొన్నారు.