15 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం.. హోటల్స్ లేవు.. తిండి లేదు.. ప్రయాణికుల నరకం

15 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం.. హోటల్స్ లేవు.. తిండి లేదు.. ప్రయాణికుల నరకం

నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.  హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులకు  పీడకలగా మారాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ-కుల్లు ; మనాలి-చండీగఢ్‌ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. 

దాదాపు 200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయి రోడ్ల పైనే నానా అవస్థలు పడుతున్నారు.  దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్  ఏర్పడింది.  దగ్గర్లో హోటల్స్ లేకపోవడం,  ఉన్న కొన్ని హోటల్స్ లో కూడా  రూమ్స్ దొరకకపోవడంతో మహిళలు, చిన్న పిల్లలు నరకం చూస్తున్నారు. భారీ వర్షాలకు తోడు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో హైవేపై నిన్న సాయంత్రం నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా పడిన బండరాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.  

ఏడెనిమిది గంటల తర్వాతే వాహనాలు ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  మండీ, సుందర్‌నగర్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో.. ఆదివారం రాత్రి  10గంటల సమయంలో పోలీసులు తమ వాహనాలను నిలిపివేశారని.. వెనక్కి వెళ్లిపోవాలని చెప్పారని పర్యాటకులు చెబుతున్నారు.   ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదని పర్యాటకులు అంటున్నారు.  

ALSO READ:వరల్డ్ కప్ క్వాలిఫయర్: అమెరికాను చీల్చి చెండాడిన జింబాబ్వే

రాష్ట్రంలో భారీ వర్షాలకు 301 రోడ్లు దెబ్బతిన్నాయి. యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టామని . 180 రోడ్లను ఈరోజు సాయంత్రం నాటికి పునరుద్ధరిస్తామని హిమాచల్​ ప్రదేశ్​ పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్​ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో  మరో రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ స్థానిక వాతావరణ శాఖ కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది.