
హైదరాబాద్, వెలుగు: చీడ పీడలను తట్టుకొని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే 15 రకాల కొత్త క్రాప్ వెరైటీలను ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. శుక్రవారం వాటిని అగ్రికల్చర్ సెక్రటరీ, వర్సిటీ ఇచ్చార్జ్ వీసీ రఘునందన్‌రావు రిలీజ్ చేశారు. కొత్త వెరైటీల్లో వరిలో 10 రకాలు, నువ్వుల్లో రెండు, మినుములో ఒకటి, పశుగ్రాసం, సజ్జలో రెండు రకాలు ఉన్నాయి. వీటితో కలిపి గత 8 ఏండ్లలో యూనివర్సిటీ 61 కొత్త పంట రకాలను అభివృద్ధి చేసినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఇందులో వరిలో 26 రకాలు, కందిలో 8 రకాలను అత్యధికంగా డెవలప్ చేసింది.
తక్కువ నూకవచ్చే రకాలపై ప్రత్యేక దృష్టి
స్టేట్‌లో రైతులు నూక అధిక శాతం వచ్చే వరి రకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నూకశాతం తగ్గించే రాజేంద్రనగర్ వరి-5(ఆర్‌ఎన్‌ఆర్ 29325) కొత్త రకాన్ని వర్సిటీ డెవలప్‌చేసింది. ఈ వడ్లు మిల్లింగ్ చేయగా 62.1 హెడ్ రైస్ వస్తుందని, వానకాలం, యాసంగి రెండు సీజన్లకు అనువుగా ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఈ పంట 120–125 రోజుల్లో చేతికొస్తుందని తెలిపారు. వానాకాలంలో తక్కువ నూక వచ్చేలా తెలంగాణ రైస్-5 (ఆర్‌ఎన్‌ఆర్ 28362) రకాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అధిక నూక వచ్చే 1010, 1001 రకాలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రైస్-6(కేఎన్‌ఎం 7048) కొత్త వెరైటీని డెవలప్‌చేశారు. అలాగే, ఈదురుగాలులకు పంట నేలపై పడిపోకుండా, తక్కువ ఎత్తు పెరిగేలా రాజేంద్రనగర్ వరి-4(ఆర్‌ఎన్‌ఆర్ 21278) రకాన్ని అభివృద్ధి చేశారు.
జీన్ ఎడిటింగ్ పై వర్సిటీ రీసెర్చ్ చేస్తోంది
అగ్రికల్చర్ యూనివర్సిటీ జీన్ ఎడిటింగ్(జెనెటిక్ మాడిఫైడ్)పై పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే మొక్కజొన్న, వరిలో రీసెర్చ్ పూర్తయింది. కాటన్‌లో జీన్ ఎడిటింగ్‌పై రీసెర్చ్ చేసేందుకు కేంద్రం అనుమతి కోరాం. రాష్ట్రంలో 8,500 ఎకరాల్లో హైడెన్నిటీ కాటన్ రీసెర్చ్ జరుగుతోంది. గతంలో కొత్త వెరైటీలు అభివృద్ధి చేయడానికి 8 నుంచి-10 ఏండ్ల టైం పట్టేది. నేడు స్పీడ్ బ్రీడింగ్, బయో, డిజిటల్ టెక్నాలజీలతో 5 ఏండ్లలో పరిశోధన పూర్తి చేయగలుగుతున్నాం. నూకశాతం తగ్గే వరి రకాలపై రీసెర్చ్ జరుగుతోంది, మరో మూడు నాలుగేండ్లలో రూపొందిస్తాం.
- డైరెక్టర్ జగదీశ్వర్
హెచ్‌ఎంటీ, జైశ్రీరాం, చిట్టి ముత్యాలకు ప్రత్యామ్నాయం
మహారాష్ట్రలో అభివృద్ధి చేసిన సన్నరకం వడ్లు హెచ్‌ఎంటీ, జైశ్రీరాం రకాలకు ప్రత్యామ్నాయంగా జగిత్యాల వరి-2(జేజీఎల్ 28545), జగిత్యాల వరి-3(జేజీఎల్ 27356) రకాలను వర్సిటీ డెవలప్‌చేసింది. ఈ వరి రకాలు ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తున్నట్లు రీసెర్చ్‌లో తేల్చారు. చిట్టి ముత్యాలకు ప్రత్యామ్నాయంగా రాజేంద్రనగర్ వరి-3(ఆర్‌ఎన్‌ఆర్ 15459) రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది చిట్టి ముత్యాల వడ్లలాగే సువాసనతో పాటు, ఎగుమతికి అవకాశం ఉంటుందని తెలిపారు. తాజాగా రూపొందించిన కొత్త వెరైటీలు వచ్చే వానాకాలం నుంచి అందుబాటులోకి వస్తాయని సైంటిస్ట్‌లు వివరించారు.