15 మంది ఎంపీలపై వేటు.. సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్

15 మంది ఎంపీలపై వేటు.. సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్

ఢిల్లీ:  14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్‌సభలో వేటు పడింది. శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. తొలుత ఐదుగురిపై.. ఆ తర్వాత తొమ్మిది మందిపై వేటు వేయడం గమనార్హం. లోక్ సభలో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.

స్పీకర్ ఆదేశాలను ఉల్లంఘించిన ప్రతాపన్‌, హిబీ ఈడన్‌, జోతి మణి, రమ్యా హరిదాస్‌, డీన్‌ కురియాకోస్‌ పై తొలుత సస్పెన్షన్ వేటు వేశారు.  ఈ మేరకు వారి సస్పెన్షన్ కు తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సభలో పేర్కొన్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్‌ సభను మధ్యాహ్నాం 3 గంటల వరకు వాయిదా వేశారు.  

సభ పున: ప్రారంభం కాగానే.. విపక్ష సభ్యులు ఇదే అంశంపై లోక్ సభలో ఆందోళనకు దిగారు. దీంతో బెన్నీ బెహనన్‌, వీకే శ్రీకందన్‌, మహమ్మద్‌ జావెద్‌, పీఆర్‌ నటరాజన్‌, కనిమొళి, కే సుబ్రహ్మణ్యం, ఎస్‌ఆర్‌ పార్థిబన్‌, ఎస్‌ వెంకటేశన్‌, మాణిక్కం ఠాగూర్‌ను సస్పెండ్‌ చేస్తూ సభలో ప్రహ్లాద్‌ జోషీ మరోసారి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం రేపు ఉదయానికి లోక్‌సభ వాయిదా పడింది.


రాజ్యసభ నుంచి ఒకరిపై.. రాజ్యసభలోనూ పార్లమెంటు భద్రతపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సభా మర్యాదలు పాటించని  ఎంపీ  డెరెక్ ఓబ్రియన్ పై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సస్పెన్షన్ వేటు విధించారు.