
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ రానున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇక్కడ నివసిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజలతో సమ్మేళనాలు నిర్వహించనున్నారు. దీని కోసం బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో బీజేపీ నాయకుడు మురళీధర్ రావు సమావేశమయ్యారు. మొత్తం 15 రాష్ట్రాల సమ్మేళనాలను బీజేపీ ఏర్పాటు చేస్తున్నది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమ్మేళనాల కోసం వేదికలను గుర్తించే పనిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఈ సమ్మేళనాలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా, రాత్రి డిన్నర్ సమయంలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర నేతలు చెప్తున్నారు. ఈ సమ్మేళనాలతో రాజకీయంగా ఇతర రాష్ట్రాల ప్రజల మద్దతు ఇక్కడ బీజేపీకి ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు పలువురు బీజేపీ జాతీయ నేతలు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు జాతీయ నేతలు ఉండనున్నారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, మాజీ డిప్యూటీ సీఎంలు, బీజేపీ జాతీయ ఆఫీసు బేరర్లు ఉన్నారు. వీరు ఆయా నియోజకవర్గాల్లో వివిధ మోర్చాలతో సమావేశం కానున్నారు. శక్తి కేంద్రాల ఇన్చార్జులతో, మండల పార్టీ అధ్యక్షులతో, ఆర్ఎస్ఎస్ నాయకులతో సమావేశమవుతారు. తమకు కేటాయించిన నియోజకవర్గాల నుంచి వచ్చే నెల 2 న ఉదయం బయలుదేరి నేరుగా హెచ్‌ఐసీసీ నోవాటెల్ లో జరుగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.
అతిథుల కోసం ప్రత్యేక కండువాలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ సహా ఇతర ముఖ్యనేతలకు ప్రత్యేక కండువాలు కప్పేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. స్టోన్స్ తో ప్రత్యేకంగా తయారుచేయించిన కండువాలను అతిథులకు కప్పేందుకు తయారు చేయించారు.
ప్రధాని మోడీకి నోవాటెల్ లోనే బస
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోడీతో పాటు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న పార్టీ చీఫ్ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీకి హెచ్‌ఐసీసీలోని నోవాటెల్ లోనే బసకు ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఇందులోనే బస ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఈ హోటల్ లో మొత్తం ఆరు సూట్లు ఉండగా... ఈ ఆరుగురు ప్రముఖులకు ఇందులోనే బసకు ఏర్పాట్లు చేశారు. ఇక ఇందులో మరో 270 రూములు ఉండగా.. ప్రముఖుల పీఎస్ లు, పీఏలు, సెక్యూరిటీ అధికారులకు కేటాయించారు. కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలకు గచ్చిబౌలిలోని ట్రెడెంట్, రాడిసన్ బ్లూ, ఆవాస హోటళ్లను బుక్ చేశారు.
వర్షం వచ్చినా తడవకుండా జర్మన్ హ్యాంగర్
వచ్చే నెల 3న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో మోడీ సభ జరిగే టైంలో వర్షం వచ్చినా జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన జర్మన్ హ్యాంగర్ లను ఏర్పాటు చేస్తున్నారు. మోడీ సభకు తరలిరావాలని సుమారు 10 లక్షల ఆహ్వాన కార్డులను రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు బుధవారం నుంచి పంపిణీ చేస్తున్నారు.