దహెగాం స్కూల్​లో ఫుడ్​ పాయిజన్

దహెగాం స్కూల్​లో ఫుడ్​ పాయిజన్
  •     15 మంది విద్యార్థులకు అస్వస్థత
  •     ఆలస్యంగా వెలుగులోకి..
  •     విచారణ జరుపుతున్నామన్న అధికారులు

భైంసా, వెలుగు : నిర్మల్​జిల్లా భైంసా మండలం దహెగాం ప్రభుత్వ స్కూల్​లో ఫుడ్​పాయిజన్ కావడంతో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు కథనం ప్రకారం..గత గురువారం స్కూల్​కు వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్నారు. స్కూల్​విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్లాక వాంతులు, విరేచనాలు కావడంతో తల్లిదండ్రులు వారిని భైంసాలోని పలు ప్రైవేటు హాస్పిటల్స్​కు తీసుకెళ్లారు.

ఆయా హాస్పిటల్స్​లో సుమారు 15 మంది చికిత్స తీసుకున్నారు. సోమవారం ప్రైవేట్ హాస్పిటల్స్​లో బిల్లులు కట్టలేక కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఏరియా హాస్పిటల్​లో జాయిన్​ చేయించారు. ఇందులో వినయ్​అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగినా విద్యాశాఖ అధికారులు, టీచర్లు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఓపీడీ విభాగం, స్కానింగ్​మెషీన్​ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రామారావు పటేల్​కు విషయం తెలియడంతో విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలందించాలని డాక్టర్లను ఆదేశించారు. దీనిపై ఎంఈవో సుభాష్​ను వివరణ కోరగా.. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా తెలిసిందని, స్కూల్​లోనే ఫుడ్​ పాయిజన్​ జరిగిందా? లేక ఇంకేమైనా కారణాలున్నాయనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం విద్యార్థులందరూ బాగానే ఉన్నారన్నారు.