యువతా మేలుకో..! నేడు స్వామి వివేకానంద 158వ జయంతి

యువతా మేలుకో..! నేడు స్వామి వివేకానంద 158వ జయంతి

స్వామి వివేకానంద.. ఈ పేరు వింటేనే నరనరాల్లో రక్తం వేడెక్కుతుంది. ఉత్సాహం తట్టి లేపుతుంది. ప్రపంచమంతా భారత దేశంవైపు చూసేలా చేసిన మహోన్నత వ్యక్తి.. ఓ శక్తి స్వామి వివేకానంద. ఆయన సూక్తులు విని, ఆచరించినవారు ఎంతటి బద్దకస్థులైనా జీవితంలో సక్సెస్ అయినవారు ఎంతోమంది ఉన్నారు. గొప్ప కుటుంబంలో పుట్టినా.. చిన్నప్పటినుంచే ఆధ్యాత్మికతపై ఇంట్రెస్ట్ చూపించారు. రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతను చదువుతూ ఏమైనా సందేహాలుంటే వెంటనే తన తల్లిని అడగి తెలుసుకునేవారు. చిన్న వయసులోనే ఏదైనా సాధించాలన్న తపనతో ఉండేవారు. తనకు మంచి గురువును ఎంచుకునే క్రమంలో ఒకరోజు ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరుతారు. రామకృష్ణ పరమహంసను నీవు దేవుడిని చూశావా అని అడుగుతారు. అప్పుడు పరమహంస ఏ మాత్రం ఆలోచించకుండా చూశాను. నీవు నన్ను ఎంత దగ్గరగా చూస్తున్నావో.. అలాగే నేను దేవుడిని చూశాను అంటారు. ఆ ఒక్క మాటతో చలించిన స్వామి వివేకానంద .. రామకృష్ణ పరమహంసకు శిష్యుడు అవుతారు. తక్కువ కాలంలోనే రామకృష్ణ పరమహంస దగ్గర ఎన్నో కఠోర సాధనలు, ఆధ్యాత్మిక విషయాలు, తపస్సు నేర్చుకుని గురువుకు మించిన శిష్యుడు అయ్యారు.

ఆ తర్వాత దేశవ్యాప్తంగా పర్యటిస్తూ భారతదేశ సంప్రదాయాలు, విలువలు, హిందూ ధర్మం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. దేశంలోనే కాకుండా.. ప్రపంచంలోని పలుచోట్ల ఆధ్యాత్మిక సభల్లో పాల్గొని భారత దేశం గొప్పతనాన్ని ..సనాతన ధర్మాన్ని వెలుగెత్తి చాటారు. ముఖ్యంగా అమెరికాలో జరిగిన ప్రపంచ దేశాల మత సమ్మేళనంలో.. భారతదేశం తరుపున పాల్గొన్న స్వామీ వివేకానంద ప్రసంగం ఒక సంచలనమే సృష్టించింది. ఆయన ప్రసంగ విశిష్టత గురించి ప్రపంచ దేశాల పత్రికలన్నీ ప్రముఖంగా రాశాయి. అవన్నీ చూసిన అమెరికాలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త స్వామి వివేకానందను కలవాలి అనుకున్నారు. స్వామీజీ క్షణం తీరిక లేకుండా ఉన్నా కూడా తన పరపతిని అంతా ఉపయోగించి ఎలాగోలా అప్పాయింట్ మెంట్ సంపాదించుకున్నారు. అనుకున్న సమయానికి స్వామి వివేకానంద ఉన్న ప్రత్యేక గదిలోకి ప్రవేశించారు. “స్వామి నేను క్షణం తీరిక లేని వ్యాపారిని. నేను తీవ్రమైన ఆధ్మాత్మిక జ్ఞాన పిపాసిని కూడా. కాకపోతే నాకున్న సమయం మాత్రం చాలా తక్కువ. అందువల్ల వేదాలు..ఉపనిషత్తులు చదవమని కానీ.. సాధువుల ప్రసంగాలు వినాలని కానీ..యోగా ధ్యానాలు చేయాలని దయచేసి నాకు చెప్పొద్దు. వీటితో ఏ మాత్రం సంబంధం లేకుండా ఒకటి రెండు మాటల్లోనే నాకు జ్ఞాన సిద్ధిని కలిగించే మోక్ష మార్గమేదైనా తెలిస్తే చెప్పండి. నిజంగా మీరు ఒకటి, రెండు మాటల్లో చెప్పాలనుకుంటే సరే అనండి. లేదంటే వెంటనే వెళ్లి పోతాను. ఎందుకంటే నాకు మీవద్ద ఎక్కువ గంటలు గడిపే సమయం లేదు” అంటారు.

ఆ వ్యాపారి మాటలు విన్న వివేకానంద.. హ..హ.. అంటూ నవ్వుతూ.. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు ఆశించినట్లే ఒకటి, రెండు మాటల్లోనే మీకు జ్ఞానం కలిగేలా చేస్తాను. మీరు వేదాలు, ఉపనిషత్తులు ఏవీ చదవద్దు. సాధువుల ప్రసంగాలు ఏవీ వినొద్దు. యోగా, ధ్యానాలేమీ చేయనే చేయొద్దు అన్నారు. ఆ మాటలు వినగానే వ్యాపారి మొఖంలో అంతులేని ఆనందం తొనికిసలాడింది. మరైతే నన్ను ఏంచేయమంటారు స్వామీజీ అన్నాడు వ్యాపారి ఎంతో ఉత్కంఠగా!. అప్పుడు వివేకానంద ఇలా అంటాడు.. చాలా సులువు రోజుకొకసారి మీ మరణాన్ని మీరు గుర్తు చేసుకోండి చాలు. నీకు జ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఇక నేను చెప్పాల్సింది అయిపోయింది.. మీరు బయలుదేరవచ్చు అన్నాడు వివేకానంద!. ఆ మాటల్లోని అంతసారమేమిటో ఆ వ్యాపారికి చక్కగా అర్ధం అయిపోయింది. అతడి మనసు సంబ్రమాశ్చర్యాలతో నిండి పోయింది. ప్రతి రోజూ మరణాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఏమిటి?. జీవితం ఎంతో చిన్నది అని తెలుసుకోవడమే!. ఇంత చిన్న జీవితంలో హీనమైన కార్యకలాపాలకు తావులేకుండా ఉన్నతమైన ఆలోచనలతో ఉత్కృష్టమైన జీవితాన్ని సాగించాలన్న సంకల్పానికి రావడమే!. స్వామీజీ మాటల్లోని ఈ సత్యం ఆ వ్యాపారికి అర్థమైపోయింది. వెంటనే లేచి స్వామి వివేకానంద పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, నిండు ఆనందంతో వెళ్లిపోయాడు. ఇలాంటి సక్సెస్ స్టోరీలు స్వామీజీ జీవితంలో ఉన్నాయి.

ఎన్నో దేశాలు తిరిగిన స్వామీజీ అమెరికా పర్యటనను ముగించుకుని భారతదేశం ఎంతో గోప్పదని..స్వదేశంలో అడుగుపెట్టగానే భూమిని ముద్దాడుతూ నేల తల్లికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన సూక్తులు యువతను మేల్కొలుపుతాయి. ఇనుప నరాలు, ఉక్కు కండరాలున్న వంద మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను” అన్న ఆధ్యాత్మిక యోగి స్వామి వివేకానంద. ఈ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందని నూరేళ్ల క్రితమే గుర్తించి, బాహాటంగా ఆనాడే చాటిన దార్శనికత ఆయనది. సృజనాత్మక మనోవీక్షణ ప్రక్రియకు ప్రాణం పోసి, దానిని విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పించిన స్ఫూర్తి ప్రదాతలను పేర్కొనవలసి వస్తే ముందుగా చెప్పాల్సిన పేరు నిస్సందేహంగా స్వామి వివేకానందుడిదే. ఆధునిక భారతదేశం ప్రపంచంలోనే ఒక మహత్తర శక్తిగా ఎదగడానికి ఆయన జీవించి ఉన్న కొద్దికాలంలోనే పటిష్టమైన పునాదులు వేశారు. కాషాయం వేషం కాదు..మన సంస్కృతి అని చాటి చెప్పిన గొప్ప సన్యాసి స్వామి వివేకానంద.

జనవరి 12, 1863లో జన్మించిన వివేకానంద..జూలై 4, 1902లో మరణించారు. నేటి యువత క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా.. వివేకానంద అడుగుజాడలో నడుస్తూ జీవితంలో సక్సెస్ అయినప్పుడే మనం ఆయనకిచ్చే ఘన నివాళి.