
హైదరాబాద్, వెలుగు: చదువుతో పాటు .. ఇన్నొవేషన్స్ పైనా దృష్టి పెడుతున్నారు స్కూల్ స్టూడెంట్లు. చిట్టి బుర్రలతో పెద్దగా ఆలోచిస్తూ ఇన్నొవేటివ్ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. సైన్స్ఎగ్జిబిషన్లలో ప్రతిభ చూపిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్తున్నారు. ఇటీవల సిటీ నుంచి 16 మంది స్కూల్ స్టూడెంట్లు సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన ఇన్‌స్పైర్ మానక్ అవార్డ్స్ 2020–21కు సెలక్ట్ అయ్యారు. వీరిలో గవర్న మెంట్ స్కూల్స్ స్టూడెంట్లు కూడా ఉన్నారు.
కంప్యూటర్ ఎడ్యుకేషన్‌తోనే..
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సిటీలోని చాలా వరకు ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్లకు కంప్యూటర్ ఎడ్యుకేషన్‌ను తప్పనిసరిగా అందిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. స్టూడెంట్లు కూడా కొత్త ఇన్నొవేషన్స్ కనిపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్లకు ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ ల ద్వారా ప్రాక్టికల్స్ చెప్తున్నారు. టాలెంటెడ్ స్టూడెంట్లను సైన్స్ ఫెయిర్ , కాంపిటీషన్లకు పంపిస్తున్నారు. ఇందులో భాగంగా ఏటా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి( ఎస్సీఈఆర్టీ ) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్ నిర్వహిస్తుంటారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను స్టేట్ లెవెల్లో పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఈ కాంపిటీషన్ లో సిటీ నుంచి 159 స్టూడెంట్ల ఇన్నొవేషన్లు ఎంపికవగా... 16మంది ఇన్‌స్పైర్ అవార్డుకు సెలక్ట్ అయినట్టు డీఈవో రోహిణి తెలిపారు. స్టూడెంట్లు తమ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసేందుకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరి ఖాతాలో రూ. 10వేలు జమ చేసినట్టు ఆమె పేర్కొన్నారు.
టెంపరేచర్ తెలిపే బ్యాడ్జి..
కరోనా భయంతో జ్వరం వచ్చిందంటే చాలు బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవడం ప్రస్తుతం అందరికీ అలవాటైంది. టెంపరేచర్ వందకు చేరగానే అలర్ట్ చేసే ‘బ్యాడ్జీ’ని హిమాయత్ నగర్‌లోని సెయింట్ పాల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోన్న అమర్త్య తయారు చేశాడు. బాడీ టెంపరేచర్ 99 డిగ్రీలు ఉంటే బ్యాడ్జ్ లో ఉన్న లైట్ వెలుగుతుంది. ఇలా బాడీ టెంపరేచర్‌ను ఈజీగా గుర్తించొచ్చు. ఓ ప్రైవేటు స్కూల్ కి చెందిన టెన్త్ క్లాస్ స్టూడెంట్ టి. గిరీశ్ సాయి పోర్టబుల్ శానిటైజర్‌ను తయారు చేశాడు. ఇవే కాకుండా స్మార్ట్ రోబోటిక్ వేటర్, క్లీనింగ్ ఆఫ్ వాటర్ బాడీస్, హ్యూమన్ ఎనర్జీ గ్రిడ్, స్మార్ట్ కేబుల్ ప్లఫ్, రిమోట్ కంట్రోల్ స్క్రాప్ క్లీనర్, హ్యాండ్ అటాచ్డ్ సానిటైజర్ డిస్పెన్సర్, సియాచిన్ బ్యాగ్, హ్యాండీ స్పూన్, ఎల్డర్లీ పీపుల్ యాప్, ఫ్లోర్ శానిటైజింగ్ అండ్ మాపింగ్ మూవర్ ఇలా రకరకాల ఇన్నొవేటివ్ ప్రాజెక్ట్‌లను రూపొందించారు స్టూడెంట్లు.
కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోల సాయం..
స్టూడెంట్లు తయారు చేసిన ఈ ఇన్నోవేషన్స్ ను చూసి కార్పొరేట్ కంపెనీలు సైతం ముచ్చట డుతున్నాయి. వాటిని మరింత డెవలప్ చేయడానికి కావల్సిన సాయం అందిస్తామని ముందుకు వస్తున్నాయి. అందుకు టెక్నికల్ స్కిల్స్, ఈ–ఎడ్యుకేషన్, కోడింగ్కోర్సులను చెప్తామంటూ క్లాస్‌లు స్టార్ట్ చేస్తున్నాయి. వీటితో పాటు గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకు కూడా టెక్నికల్ గా స్కిల్ డెవలప్ అవ్వాలని ఎన్జీవోలు పలు యాక్టివిటీస్ ను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటికల్) లో కొత్త కాన్సెప్ట్ లను స్టూడెంట్స్ కి పరిచయం చేస్తున్నాయి.
స్టడీస్‌తో పాటు ల్యాబ్
స్టూడెంట్స్ లో మునుపటితో పోలిస్తే క్రియేటివిటీ పెరిగింది. చదవడంతో పాటు ల్యాబ్ లలో ప్రాక్టికల్స్ చేస్తున్నారు. హై స్కూల్ స్టూడెంట్లకు ప్రతి ఏడాది సైన్స్ ఫెయిర్ కాంపిటీషన్లు జరుగుతాయి. ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవి జరుగుతుంటాయి. మంచి ప్రయోగాలను సెలక్ట్ చేసి ఎగ్జిబిషన్లను కండెక్ట్ చేస్తారు. దీని ద్వారా స్టూడెంట్లలో క్రియేటివిటీ మరింతగా పెరుగుతుంది. – సి. ధర్మేందర్ రావు, జిల్లా సైన్స్ అధికారి
గైడ్ చేస్తున్నాం..
కరోనా ఎఫెక్ట్ తో ఏడాదిన్నరగా ఇన్‌స్పైర్ అవార్డులకు సంబంధించిన అన్ని ఈవెంట్స్ వర్చువల్ గానే జరుగుతున్నాయి. ఈ ఏడాది జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 16 మంది స్టూడెంట్లు రూపొందించిన ప్రాజెక్ట్స్ ఎంపికయ్యాయి. హెడ్ మాస్టర్లు, గైడ్ టీచర్ల సహాకారంతో స్టూడెంట్స్ బాగా రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీలో రాణించి, జాతీయ స్థాయి కాంపిటీషన్లకు సెలక్ట్ అయ్యే లా ప్రాజెక్ట్ లు రూపొందించాలని ఆశిస్తున్నాం.
– ఆర్. రోహిణి, డీఈవో, హైదరాబాద్