ఎనిమిదో టైటిల్‌‌ దిశగా జొకోవిచ్‌‌.. అలవోకగా క్వార్టర్స్‌‌లోకి

ఎనిమిదో టైటిల్‌‌ దిశగా జొకోవిచ్‌‌.. అలవోకగా క్వార్టర్స్‌‌లోకి

లండన్‌‌: కెరీర్‌‌లో 25వ గ్రాండ్‌‌స్లామ్‌‌ వేటలో ఉన్న సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌.. వింబుల్డన్‌‌లో ఎనిమిదో టైటిల్‌‌ దిశగా మరో అడుగు ముందుకేశాడు. సోమవారం (జులై 07) జరిగిన మెన్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో ఆరోసీడ్‌‌ జొకోవిచ్‌‌ 1–6, 6–4, 6–4, 6–4తో అలెక్స్‌‌ డి మినుయెర్‌‌ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌‌లోకి ప్రవేశించాడు. తొలి సెట్ చేజార్చుకున్నా తర్వాతి మూడు సెట్లలో తన ట్రేడ్ మార్క్‌‌ ఆటతో చెలరేగిపోయాడు. 

ముఖ్యంగా నాలుగో సెట్‌‌లో అలెక్స్‌‌ 4–2 లీడ్‌‌లోకి వెళ్లినా జొకో పవర్‌‌ఫుల్‌‌ సర్వీస్‌‌లు, బ్యాక్‌‌హ్యాండ్‌‌ వాలీ విన్నర్ల ముందు నిలవలేకపోయాడు. మ్యాచ్‌‌ మొత్తంలో ఆరు ఏస్‌‌లు, ఐదు డబుల్‌‌ ఫాల్ట్స్‌‌ చేసిన జొకో 13 బ్రేక్‌‌ పాయింట్లలో ఆరింటిని కాచుకున్నాడు. 38 విన్నర్లు, 44 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ చేశాడు. మరో మ్యాచ్‌‌లో రెండో సీడ్‌ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్‌) 6–7 (5/7), 6–3, 6–4, 6–4తో ఆండ్రీ రబ్లెవ్ (రష్యా)ను ఓడించి క్వార్టర్స్‌ చేరాడు.  

ఫ్లావియో కొబోలి (ఇటలీ) 6–4, 6–4, 6–7 (4), 7–6 (3)తో మారిన్‌‌ సిలిచ్‌‌ (క్రొయేషియా)పై, షెల్టన్‌ (అమెరికా) 3–6, 6–1, 7–6 (1), 7–5తో సోనెగో (ఇటలీ)పై గెలిచి ముందంజ వేశాడు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో బెలిందా బెన్సిచ్ (స్విట్జర్లాండ్‌‌) 7–6 (4), 6–4తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై, సమ్సనోవా (రష్యా) 7–5, 7–5తో మనెరియో (స్పెయిన్‌‌)పై, ఆండ్రీవా 6–2, 6–3తో నవారో (అమెరికా)పై  నెగ్గి క్వార్టర్స్‌‌లోకి అడుగుపెట్టారు. 

మెన్స్‌‌ డబుల్స్‌‌ ఇండియా ప్లేయర్ యూకీ భాంబ్రీ పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌‌లో హోరాషియో జెబాలోస్‌‌ (అర్జెంటీనా)–గ్రానోలర్స్‌‌ (స్పెయిన్‌‌) 6–4, 3–6, 7–6 (4)తో యూకీ భాంబ్రీ (ఇండియా)– రాబర్ట్‌‌ గాల్లోవే (అమెరికా)పై గెలిచారు.