రైతులకు న్యాయం చేసేందుకు వస్తే అడ్డుకుంటరా ? : మంత్రి సీతక్క

రైతులకు న్యాయం చేసేందుకు వస్తే అడ్డుకుంటరా ? : మంత్రి సీతక్క
  •  
  • బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో మిర్చి రైతులకు పరిహారం  ఇచ్చారా ?
  • మంత్రి సీతక్క ఫైర్‌‌

జయశంకర్‌‌ భూపాలపల్లి/వెంకటాపురం, వెలుగు : ‘మల్టీ నేషనల్‌‌ బ్రాండ్‌‌ మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు వస్తే అడ్డుకుంటారా..? ఆందోళనలు చేస్తారా..? మీ ప్రభుత్వంలో నష్టపోయిన మిర్చి రైతులకు ఏనాడైనా నష్ట పరిహారం చెల్లించారా..?’ అని పంచాయతీరాజ్‌‌ శాఖ మంత్రి సీతక్క బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లపై ఫైర్‌‌ అయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సోమవారం ములుగు జిల్లా వాజేడులో మొక్కజొన్న రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మల్టీ నేషనల్‌‌ కంపెనీ మెడలు వంచి తమ ప్రభుత్వం రైతుల డబ్బులను వసూలు చేసిందన్నారు.  2018లో ఈ ప్రాంతంలో రెండు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేసి నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. వెంకటాపురం మండలంలోని ముత్తారంలో సొంతంగా బ్రిడ్జి నిర్మించిన గిరిజనులను అభినందించారు. బ్రిడ్జి నిర్మాణానికి అయిన ఖర్చును ఏటూరునాగారం ఐటీడీఏ ద్వారా కేటాయిస్తామని చెప్పారు. 

అనంతరం వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాలకు చెందిన 671 రైతులకు రూ. 3. 80 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్‌‌ చైర్మన్‌‌ ఎం. కోదండరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌‌ ఎస్. అన్వేశ్‌‌రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర టీఎస్‌‌, ఏటూరునాగారం ఐటీడిఏ పీవో చిత్రా మిశ్రా, మాజీఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

బీఆర్‌‌ఎస్‌‌లో చేరలేదనే టార్గెట్‌‌ చేసిన్రు

బీఆర్‌‌ఎస్‌‌లో చేరలేదనే తనను టార్గెట్ చేస్తున్నారని, ఆ పార్టీ నేతలు ములుగులో అలజడి సృష్టిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆత్మహత్యలకు బీఆర్‌‌ఎస్‌‌ నేతలే కారణం, అమాయకులను రెచ్చగొట్టి సూసైడ్‌‌ వైపు ప్రేరేపిస్తున్నారన్నారు. పదేండ్ల బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో కాంగ్రెస్‌‌ కార్యకర్తలపై పెట్టిన కేసులు, 18 నెలల్లో కాంగ్రెస్‌‌ పెట్టిన కేసులెన్నో బహిరంగచర్చకు సిద్ధమా ? అని సవాల్‌‌ చేశారు. తనపై తప్పుడు ప్రచారం 
చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 

విత్తన చట్టాన్ని రూపొందించి అమలుచేస్తాం : మంత్రి తుమ్మల

కేంద్రం చట్టం తీసుకొచ్చే వరకు వేచి చూడకుండా రాష్ట్రంలోనే విత్తన చట్టాన్ని రూపొందించి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి అమలుచేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులు గుండె మీద చేయి వేసుకొని వ్యవసాయం చేసుకునేలా చూస్తామన్నారు. గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రహదారులు అనుసంధానం చేయాలని, భద్రాచలం – వెంకటాపురం రహదారిని అభివృద్ధి చేయాల్సి ఉందని.. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.