
శంకరపట్నం, వెలుగు : కాంట్రాక్టర్లు, బీఆర్‌ఎస్ లీడర్లకు మేలు చేసేందుకే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందని, పనుల్లో క్వాలిటీ లేకపోవడంతో అది కుంగిపోయిందని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ దూద్ బావి వద్ద సోమవారం జరిగిన జనసమితి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం కుంగుబాటుకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ గురించి బీఆర్‌ఎస్ లీడర్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
పదేండ్ల నిరంకుశ పాలనను అంతం చేసేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ప్రజలకు విద్య, వైద్యమే ముఖ్యమని.. ఈ రెండు రంగాలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా పురిటిగడ్డ అని చెప్పారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారికి శాంతి కలగాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెడ రాజు, జిల్లా కన్వీనర్ మోరే గణేశ్, ధర్మరాజు, స్రవంతి పాల్గొన్నారు.