
బులవాయో: సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ (334 బాల్స్‌లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లతో 367 నాటౌట్).. టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ముల్డర్ 2004లో ఇంగ్లండ్‌పై లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా నెలకొల్పిన 400* పరుగుల రికార్డుకు 33 రన్స్ దూరంలో ఉండగా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఆశ్చర్యపరిచాడు.
ఓవరాల్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ల లిస్ట్‌లో ఐదో ప్లేస్‌లో నిలిచాడు. లారా (400*, 375), హేడెన్ (380), జయవర్ధనే (374) ముందున్నారు. ఇక ముల్డర్ సూపర్ బ్యాటింగ్‌తో 465/4 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 114 ఓవర్లలో 626/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. బెడింగ్‌హామ్ (82), ప్రిటోరియస్ (78), బ్రేవిస్ (30), కైల్ వెరెన్ (42 నాటౌట్) రాణించారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 170 రన్స్‌కే కుప్పకూలింది. సీన్ విలియమ్స్ (83 నాటౌట్) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. ప్రేనెలన్ సుబ్రయెన్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఫాలో ఆన్ మొదలుపెట్టిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 51/1 స్కోరు చేసింది. కైతానో (34 బ్యాటింగ్), నిక్ వ్లెచ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జింబాబ్వే ఇంకా 405 రన్స్ దూరంలో ఉంది.