వరల్డ్ క్రికెట్ లో టాప్‌‌‌‌‌‌‌‌లో ఉండటమే మా టార్గెట్‌‌‌‌‌‌‌‌:స్మృతి మంధాన

వరల్డ్ క్రికెట్ లో టాప్‌‌‌‌‌‌‌‌లో ఉండటమే మా టార్గెట్‌‌‌‌‌‌‌‌:స్మృతి మంధాన

అడిలైడ్: ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్ నిలకడగా విజయాలు సాధిస్తూ వరల్డ్ క్రికెట్‌‌‌‌‌‌‌‌పై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తోందని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పింది. గతేడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ గెలిచినప్పటి నుంచి సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న  హర్మన్‌‌‌‌‌‌‌‌ ప్రీత్ కెప్టెన్సీలోని విమెన్ ఇన్ బ్లూ  ఇప్పుడు జూన్‌‌‌‌‌‌‌‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌పై కన్నేసింది.  పదేండ్ల తర్వాత  ఆస్ట్రేలియా గడ్డపై టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకొని ఈ సీజన్‌‌‌‌‌‌‌‌తో పాటు  వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ సన్నాహకాలను ఇండియా ఘనంగా ప్రారంభించింది. శనివారం జరిగిన మూడో టీ20లో మంధాన సూపర్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో జట్టు ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ తర్వాత బీసీసీఐ టీవీతో మాట్లాడిన స్మృతి మంధాన జట్టు ఆలోచనా విధానాన్ని పంచుకుంది. ‘నిలకడగా రాణించడంపైనే మా టీమ్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ప్రత్యర్థి ఎవరు? గతంలో ఏం జరిగింది? అనే విషయాల గురించి మేం ఎక్కువగా ఆలోచించం. ఫలానా టీమ్‌‌‌‌‌‌‌‌ను ఓడించామనేది ఇప్పుడు ముఖ్యం కాదు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఆధిపత్యం చెలాయించే దిశగా మేం అడుగులు వేస్తున్నాం. ఎవరిని ఓడించాం, ఎక్కడ ఓడించాం అనేది ముఖ్యం కాదు.  నిలకడగా విజయాలు సాధిస్తూ టాప్‌‌‌‌‌‌‌‌లో కొనసాగడమే మా టార్గెట్‌‌‌‌‌‌‌‌’ అని మంధాన పేర్కొంది. జూన్ 12 నుంచి ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, వేల్స్ వేదికగా జరిగే  టీ20 కప్‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో మరింత మెరుగుపడటంపై ఫోకస్ పెట్టినట్టు తెలిపింది. ‘గతేడాది మేం ఎక్కువగా వన్డేలు ఆడాము, ఇప్పుడు వన్డే జట్టుగా పూర్తిగా కుదురుకున్నాం. ఈ ఏడాది టీ20 ఉంది. కాబట్టి ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో మరింత మెరుగుపడాలని, అలాగే  అత్యుత్తమ తుది జట్టును, టాప్–-15ను ఎంపిక చేసేందుకు కృషి చేస్తున్నాం’ అని మంధాన వివరించింది.