పల్లెకెలె: బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో.. టీ20 వరల్డ్ కప్ సూపర్–8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బోణీ చేసింది. పేస్–స్పిన్ కాంబినేషన్‌తో లంకేయులను కట్టడి చేసి చిన్న టార్గెట్‌ను సూపర్‌గా కాపాడుకుంది. దాంతో ఆదివారం జరిగిన గ్రూప్–2 మ్యాచ్‌లో సఫారీ జట్టు 51 రన్స్ తేడాతో శ్రీలంకపై గెలిచింది. టాస్ ఓడిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 146/9 స్కోరు చేసింది. ఫిల్ సాల్ట్ (40 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత లంక 16.4 ఓవర్లలో 95 రన్స్‌కే కుప్పకూలింది. డాసున్ షనక (30) టాప్ స్కోరర్. లంక టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసిన స్పిన్నర్ విల్ జాక్స్ (3/22)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సాల్ట్ ఒక్కడే..
గ్రూప్ దశలో ఇబ్బందిపడిన ఇంగ్లండ్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యారు. ఓ ఎండ్‌లో సాల్ట్ ఒంటరి పోరాటం చేసినా రెండో ఎండ్‌లో సరైన సహకారం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో మధుశంక (2/25) పొదుపుగా రన్స్ ఇవ్వగా.. రెండో ఎండ్‌లో దునిత్ వెల్లలాగే (3/26) వికెట్ల వేట మొదలుపెట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే బట్లర్ (7)ను వెనక్కి పంపాడు. మరో ఆరు బాల్స్ తర్వాత మహేశ్ తీక్షణ (2/21).. బెథెల్ (3)ను ఔట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 37/2తో పవర్‌ప్లేను ముగించింది. తర్వాత కూడా లంక బౌలర్లు పట్టు విడవకపోవడంతో ఇంగ్లండ్ ఏ దశలోనూ కోలుకోలేదు. 8వ ఓవర్‌లో టామ్ బాంటమ్ (6) అనూహ్యంగా రనౌటయ్యాడు. సాల్ట్‌తో కలిసి హ్యారీ బ్రూక్ (14) ఇన్నింగ్స్‌ను బాగు చేసే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. 10వ ఓవర్‌లో దునిత్ దెబ్బకు బ్రూక్ ఔటయ్యాడు. ఫలితంగా ఫస్ట్ టెన్‌లో ఇంగ్లిష్ జట్టు 68/4తో నిలిచింది. ఈ దశలో వచ్చిన సామ్ కరన్ (11) ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. లాంగాన్‌లో ఓ భారీ సిక్స్ కొట్టి దుష్మంత చమీరా (1/34)కు వికెట్ ఇచ్చాడు. ఐదో వికెట్‌కు 26 రన్స్ భాగస్వామ్యం ముగియడంతో పాటు 94 రన్స్‌కే సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. 36 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన సాల్ట్ బ్యాట్ ఝుళిపించే ప్రయత్నం చేశాడు. 15వ ఓవర్‌లో దునిత్ వేసిన షార్ట్ బాల్‌ను లాంగాన్‌లో భారీ షాట్‌కు యత్నించి హేమంత చేతికి చిక్కాడు. ఈ దశలో విల్ జాక్స్ (21), జెమీ ఓవర్టన్ (10 నాటౌట్) కాసేపు బ్యాట్ అడ్డేసినా.. వరుస విరామాల్లో లియామ్ డాసన్ (6), ఆర్చర్ (0) వెనుదిరిగడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయలేకపోయింది.
బౌలర్లు అదుర్స్
చిన్న టార్గెట్‌ను కాపాడటంలో ఇంగ్లండ్ పేస్–స్పిన్ కాంబినేషన్ అద్భుతంగా పని చేసింది. మూడో ఓవర్‌లోనే పాథుమ్ నిశాంక (9)ను ఔట్ చేసి ఆర్చర్ (2/20) ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బౌలర్లు చివరి వరకు కొనసాగించారు. నాలుగో ఓవర్‌లో విల్ జాక్స్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బాల్స్‌లో కుశాల్ మెండిస్ (4), పవన్ రత్నాయకే (0)ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌లో ఆర్చర్.. కమిల్ మిషార (6)ను దెబ్బకొట్టాడు. దునిత్ వెల్లలాగే (10), కమిందు మెండిస్ (13) ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆరో ఓవర్‌లో జాక్స్.. దునిత్‌ను ఔట్ చేయడంతో లంక పవర్‌ప్లేలో 34/5తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో షనక షనక ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. కానీ రెండో ఎండ్‌లో ఒక్కరు కూడా అండగా నిలవలేకపోయారు. 9వ ఓవర్‌లో షనక (2/27).. మెండిస్‌ను కాట్ అండ్ బౌల్డ్ చేయడంతో స్కోరు 52/6గా మారింది. కొద్దిసేపటికే దుశాన్ హేమంత (5) హిట్ వికెట్ అయ్యాడు. మధ్యలో మహేశ్ తీక్షణ (10 నాటౌట్) నిలబడినా. ..15వ ఓవర్‌లో షనక, తర్వాతి రెండు ఓవర్లలో దుష్మంత చమీరా (6), దిల్షాన్ మధుశంక (0) వెనుదిరగడంతో లంకేయులు లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయారు. రషీద్ 2, ఓవర్టన్ ఒక్క వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 146/9 (ఫిల్ సాల్ట్ 62, విల్ జాక్స్ 21, దునిత్ 3/26). శ్రీలంక: 16.4 ఓవర్లలో 95 ఆలౌట్ (షనక 30, కమిందు మెండిస్ 13, విల్ జాక్స్ 3/22, రషీద్ 2/13).
