
పిట్లం, వెలుగు : బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో సోమవారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్పదేండ్లలో నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఆయన కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు దక్కాయని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని చెప్పి.. తనే సీఎం సీట్లో కూర్చున్నాడని, వెయ్యి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ అభివృద్ధి మాత్రం చేయలేకపోయారన్నారు.
అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. ఈ సంవత్సరం ఐదు లక్షల ఇండ్లు పూర్తి చేస్తామని, రాబోయే మూడేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేసీఆర్ ఆయన ఫామ్‌హౌస్ చుట్టూ రూ.750 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు వేసుకుని ప్రజాధనాన్ని వృథా చేశాడని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో ఇంటిగ్రెటేడ్ స్కూల్స్ నిర్మిస్తోందని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి జుక్కల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న లెండి, నాగమడుగు ప్రాజెక్ట్‌లు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.