బషీర్ బాగ్ , వెలుగు : ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలిని మోసం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ కు చెందిన ఓ 62 ఏండ్ల మహిళకు మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్ మెంట్ క్లబ్ అనే ట్రేడింగ్ యాప్ లో చేరాలని మెసేజ్ వచ్చింది. మహిళ గతంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే సంస్థలో పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చేసింది.
దీంతో మెసేజ్ ను నిజమని నమ్మి లింక్ ద్వారా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంది. తర్వాత ఆ యాప్ ను ఉపయోగించి విడతల వారీగా మొత్తం రూ. 16.50 లక్షలను పెట్టుబడి పెట్టింది. తర్వాత మరో రూ. 29 లక్షలు పెట్టుపడి పెట్టాలని గుర్తుతెలియని వ్యక్తులు ఒత్తిడి చేశారు. డబ్బులు పెట్టకపోతే మొదట పెట్టిన రూ. 16.50 లక్షలు కూడా కోల్పోతావని బెదిరించారు.
దీంతో అనుమానం వచ్చిన మహిళ గతంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో డీల్ చేస్తున్న అరవింద్ అనే వ్యక్తిని సంప్రదించింది. మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్ మెంట్ క్లబ్ అనే యాప్ తో కంపెనీకి ఎలాంటి అనుబంధం లేదని అతడు చెప్పాడు. దీంతో ఖంగుతిన్న బాధితురాలు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
గేదెలు అగ్గువకు వస్తాయంటూ...
ఇబ్రహీంపట్నం, వెలుగు : యూట్యూబ్ లో వీడియోలు చూసి, గేదెలు అగ్గువకు వస్తాయంటూ నమ్మిన రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కు చెందిన సీఆర్ పీఎఫ్ కానిస్టేబుల్ పురుషోత్తమ్ చివరకు మోసపోయాడు. రాజస్తాన్ లోని జైపూర్ లో తమ వద్ద 300 గేదెలు ఉన్నాయని, వీటిని తక్కువ ధరకే అమ్ముతామంటూ యూట్యూబ్‌లో కనిపించిన ఓ వీడియోను చూశాడు. నిజమేనని నమ్మి వీడియోలో కనిపించిన నంబర్ కు ఫోన్ చేశాడు. నాలుగు గేదెలు కొనుగోలు చేసేందుకు రూ. 2.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు.
రవాణా ఖర్చుల కోసం డబ్బులు పంపాలని సదరు వ్యక్తి కోరడంతో పురుషోత్తమ్ మొదట రూ.40 వేలు ఫోన్ పే చేశాడు. తర్వాత పలుమార్లు రూ.1.37 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అయినప్పటికీ గేదెలు పంపకపోవడంతో అనుమానం వచ్చిన పురుషోత్తం డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఇంకా రూ. 10 వేలు వేస్తే అన్నీ తిరిగి పంపుతామనడంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ , ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.