రూల్స్ పాటిస్తేనే ఫండ్స్ .. 16వ ఆర్థిక సంఘం నిధులపై కేంద్రం కొత్త నిబంధనలు

రూల్స్ పాటిస్తేనే ఫండ్స్ .. 16వ ఆర్థిక సంఘం నిధులపై కేంద్రం కొత్త నిబంధనలు
  • ఈ–గ్రామ్ స్వరాజ్, పీఎఫ్​ఎంఎస్ అనుసంధానం తప్పనిసరి
  • 31 రకాల పాత కాంపోనెంట్లను రద్దు చేస్తూ. ‘కోడ్ 2084’ కింద 21 కొత్త రంగాలకే అనుమతి
  • పోర్టళ్లలో మ్యాపింగ్ చేయకపోతే నిలిచిపోనున్న బిల్లుల చెల్లింపులు
  • అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీలకు విడుదలయ్యే 16వ ఆర్థిక సంఘం నిధుల ఖర్చు విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడానికి వీలవుతుందని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా నిధుల వినియోగానికి బ్రేక్ పడుతుందని హెచ్చరించింది. 

గ్రామాల్లో పారదర్శకతను పెంచేందుకు, నిధుల దారిమళ్లింపును అరికట్టేందుకుగాను ఈ–గ్రామ్ స్వరాజ్, పీఎఫ్​ఎంఎస్ పోర్టళ్లను వెంటనే అనుసంధానం చేయాలని రాష్ట్రాలకు తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ అగర్వాల్ అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖల ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిధుల వినియోగానికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను విడుదల చేస్తూ, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్కీమ్ రూపకల్పన

16వ ఆర్థిక సంఘం నిధుల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్​ఎంఎస్ పోర్టల్‌‌‌‌లో ప్రత్యేకంగా సెంట్రల్ స్కీమ్ కోడ్ 2084ను రూపొందించింది. గతంలో 14వ, 15వ ఆర్థిక సంఘాల కాలంలో అమలు చేసిన 31 రకాల పాత కాంపోనెంట్లను రద్దు చేస్తూ, ప్రస్తుత ఆర్థిక సంఘం కోసం కొత్తగా 21 రంగాలను అందుబాటులోకి తెచ్చింది. 

గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో (జీపీడీపీ) అనుమతించిన పనులను ఈ విభాగాలకు లింక్ చేస్తేనే బిల్లుల చెల్లింపునకు సాంకేతిక అనుమతి లభించనుంది. కాగా, ఆన్‌‌‌‌ బోర్డింగ్ ప్రక్రియను రాష్ట్ర స్థాయి నుంచే పకడ్బందీగా ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి రాష్ట్రంలోని స్టేట్ పీఎఫ్​ఎంఎస్ డైరెక్టరేట్ (ఎస్​పీసీయూ) కోడ్ 2084 ఆధారంగా తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా స్టేట్ లింక్డ్ స్కీమ్ ను సిద్ధం చేయాల్సి ఉంటుంది.

 అయితే, రాష్ట్రస్థాయి అనుమతుల తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ తమ పీఎఫ్ఎంఎస్ ఖాతా ద్వారా స్కీమ్‌‌‌‌ను నమోదు చేయాలి. రాష్ట్ర ఏజెన్సీ కోడ్, బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్​సీ కోడ్ వివరాలను సమర్పించి రాష్ట్రస్థాయి ఆమోదం పొందాలి. పీఎఫ్​ఎంఎస్ నుంచి సమాచారం ఈ–గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌‌‌‌లోకి బదిలీ అయిన తర్వాతే పంచాయతీ ఖాతా యాక్టివ్ మోడ్‌‌‌‌లోకి వస్తుంది. 

ఆ తర్వాతే సర్పంచులు, జీపీ సెక్రటరీలు 16వ ఆర్థిక సంఘాన్ని ఎంపిక చేసుకుని తమ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (డీఎస్సీ మేకర్ అండ్ చెక్కర్) కీలను జనరేట్ చేసుకోవడానికి వీలవుతుంది. డిజిటల్ కీలు అమల్లోకి వచ్చిన తర్వాతే నిధుల డ్రా, బిల్లుల చెల్లింపులు సాధ్యమవుతాయి. లేదంటే పంచాయతీ ఖాతాలు స్తంభించిపోతాయి.
 

21 రంగాలకే నిధుల వినియోగం


గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సామాజిక అభివృద్ధి, జీవనోపాధి పెంపుదలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 21 ప్రాధాన్యతా రంగాలను ఖరారు చేసింది. వీటి పరిధిలోనే పంచాయతీలు తమ నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. 

గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ ఆస్తుల నిర్వహణ, విద్యా సదుపాయాల మెరుగుదల, సంతలు, గ్రామీణ మార్కెట్లు, జాతరల నిర్వహణ, వైద్యారోగ్య సేవలు, మహిళా-శిశు సంక్షేమం, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఘన- ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం కల్పించారు. సామాజిక సంక్షేమం, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విపత్తు నిర్వహణ, నేల-నీటి సంరక్షణ పనులు, పాడి, పశుసంవర్ధక శాఖ అభివృద్ధి, సోషల్ ఫారెస్ట్రీ పనులకు నిధులు వినియోగించవచ్చు.

 వీటితో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ సదుపాయాలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, పంచాయతీ కార్యాలయ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, గ్రామీణ విద్యుదీకరణ, గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం, రహదారులు, కల్వర్టుల వంటి రవాణా మౌలిక వసతులు, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, చిన్నతరహా నీటిపారుదల వనరుల సంరక్షణ, సోలార్, బయోగ్యాస్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు మాత్రమే ఈ నిధులను వెచ్చించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. నిర్దేశిత 21 రంగాలు మినహా ఇతర పనులకు నిధులను మళ్లిస్తే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.