యాదాద్రి టెంపుల్కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్.. ప్రసాదాల తయారీ కేంద్రాన్ని విజిట్ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు

యాదాద్రి టెంపుల్కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్.. ప్రసాదాల తయారీ కేంద్రాన్ని విజిట్ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని ఫుడ్​ సేఫ్టీ ఉన్నతాధికారులు శుక్రవారం సందర్శించారు. యాదాద్రి జోన్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, జిల్లా ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ పి.స్వాతి ఆలయ ప్రసాదాల విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీ విధానం, ముడి సరుకుల నిల్వ, కిచెన్ పరిసరాల పరిశుభ్రత, ప్యాకింగ్, భక్తులకు పంపిణీ చేసే విధానాన్ని పరిశీలించారు.

ఆహార భద్రతా ప్రమాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో దేవస్థానానికి ‘ఫుడ్ సేఫ్టీ లైసెన్స్’ జారీ చేశారు. భక్తులకు నాణ్యమైన, సురక్షితమైన ప్రసాదం అందించేందుకు దేవస్థానం నిరంతరం కృషి చేస్తోందని ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు.

స్వామివారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు జడ్జి..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్.మహదేవన్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి, లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేసి నారసింహుడి ఫొటోను బహూకరించారు. అంతకుముందు కొండపై గెస్ట్​హౌస్​కు చేరుకున్న జస్టిస్ మహదేవన్​కు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి ఉన్నారు.