
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో రోజురోజుకు చెత్త ఉత్పత్తి పెరుగుతుండడంతో ట్రాన్స్ ఫర్ స్టేషన్ల(సెకండరీ కలెక్షన్)కు తరలించి అక్కడి నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 42 ట్రాన్స్ ఫర్ స్టేషన్ల సంఖ్యను 60 కి పెంచుకునేందుకు సిద్దమైంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నుంచి స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు సేకరిస్తున్న చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తుంటారు. అక్కడి నుంచి జవహర్ నగర్ కు తరలిస్తున్నారు.
అయితే చెత్తను మరింత వేగంగా సిటీ నుంచి తరలించేందుకు వీలుగా 30 సర్కిళ్ల పరిధిలో అదనంగా మరో 18 ట్రాన్స్ ఫర్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను అనుకూలమైన స్థలాలను గుర్తించే బాధ్యతలను ముగ్గురు జాయింట్ కమిషనర్లకు అప్పగించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న 42 ట్రాన్స్ ఫర్ స్టేషన్ కెపాసిటీ ఉందని, కొత్తగా ఏర్పాటు చేయనున్న స్టేషన్లలో ఎంత వరకు చెత్తను నిల్వ చేయవచ్చన్న దాన్ని పరిశీలించి ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతున్న ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ లో డైలీ 8వేల టన్నుల చెత్త ఉత్సత్తి అవుతుంది.
లోడ్ పెరగడంతో ఇబ్బందులు
కాలనీలకు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో చెత్త తరలింపు స్వచ్ఛ ఆటోల డ్రైవర్లకు సవాలుగా మారింది. పైగా ఒకేసారి ఆటోలు ట్రాన్స్‌ఫర్‌స్టేషన్ల వద్ద క్యూ కడుతుండడంతో అన్‌లోడింగ్‌కు టైమ్ పడుతోంది. దీంతో కాలనీల్లో చెత్త సేకరణ ఆలస్యం అవుతోంది. కేటాయించిన ఏరియాలను ఆటోల డ్రైవర్లు కవర్చేయలేకపోతున్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు త్వరగా చేరుకోలేకపోతున్నారు. ట్రాన్స్ ఫర్ స్టేషన్లపై లోడు పెరిగి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భరించలేని కంపు కొడుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ స్టేషన్లు ఏర్పాటు చేసిన టైమ్‌లో చుట్టూ ఇండ్లు లేవు. తర్వాత క్రమంగా నిర్మాణాలు పెరిగాయి. యూసఫ్‌గూడ, లోయర్ ట్యాంక్ బండ్ లోని చెత్త ట్రాన్స్ స్టేషన్ల వద్ద ఇదే పరిస్థితి. చెత్త పేరుకుపోకుండా వెంటవెంటనే తరలించాలని, లేకుండా ట్రాన్స్ ఫర్ స్టేషన్‌ను ఎత్తివేయాలని స్థానికులు జీహెచ్ఎంసీకి అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. జియాగూడలో మెయిన్రోడ్డుపైనే ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉంది. చెత్త పేరుకుపోయిన టైంలో రాకపోకలకు, స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. సిటీలోని మిగిలినచోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ ఫర్ స్టేషన్లతో కాస్త ఇబ్బందులు తొలగనున్నాయి.