ముంచుతున్న డంపింగ్ యార్డు మురుగు

ముంచుతున్న డంపింగ్ యార్డు మురుగు
  • జవహర్​నగర్​ సహా చుట్టుపక్కల18 ప్రాంతాలు ఆగం
  • చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు కలుషితం
  • నత్తనడకన ట్రీట్​మెంట్ ప్లాంట్ పనులు
  • ఉన్న జాగా సరిపోక కొత్తగా కార్మికనగర్​లో డంపింగ్

హైదరాబాద్, వెలుగు: కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నా కొన్నేండ్లుగా జవహర్​నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరడం లేదు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్త, క్యాపింగ్​చేసిన చెత్త నుంచి వస్తోన్న మురుగు నీరు సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది. చెరువులు, కుంటలు, పొలాల్లోకి మురుగు చేరుతోంది. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. జవహర్​నగర్​కార్పొరేషన్, దమ్మాయిగూడ, నాగారం పరిధిలోని ప్రాంతాల్లోని చాలా చెరువులు ఇప్పటికే పూర్తిగా మురుగుమయం అయ్యాయి. బోర్ల నుంచి రంగు మారిన దుర్వాసనలతో కూడిన నీళ్లు వస్తున్నాయి. మురుగు సమస్యను పరిష్కరించేందుకు క్యాపింగ్​చేసిన చెత్త నుంచి మురుగు నీటిని శుద్ధి చేసి పంపేందుకు జీహెచ్ఎంసీ రూ.251కోట్లతో ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. అత్యవసరమైన ప్లాంట్​ఏర్పాటును అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. జోరు వానలతో చెత్త, దుర్వాసన, మురుగు సమస్యలు జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డైలీ సిటీ నుంచి తెచ్చిపోస్తున్న చెత్తపై క్యాంపింగ్​చేస్తున్నట్లు కనిపించడం లేదు.
 

మంత్రి కేటీఆర్ హామీ గాలికి..
ప్రస్తుతం 351 ఎకరాల్లో డంపింగ్ యార్డు విస్తరించి ఉంది. చుట్టుపక్కల 15 నుంచి 18 ప్రాంతాల్లో భరించలేని కంపు సమస్య ఉంది. జవహర్ నగర్, దమ్మాయిగూడ, బాలాజీనగర్, గబ్బిలాలపేట, అంబేద్కర్ నగర్, మల్కారం, రాజీవ్ గాంధీనగర్, కార్మిక నగర్, శాంతి నగర్, ప్రగతి నగర్, హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, బీజేఆర్ నగర్, అహ్మద్ గూడ, తిమ్మాయిపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి ప్రాంతాలతోపాటు సైనిక్ పురి తదితర ప్రాంతాల్లో 24 గంటలు దుర్వాసన వస్తూనే ఉంటుంది. 2020 నవంబర్​లో డంపింగ్​ యార్డులో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ దుర్వాసన సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఏం మారలేదు. ప్రస్తుతం కురుస్తున్న జోరు వానలకు డంప్​యార్డు పరిసర ప్రాంతాల ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్తకు సరిగ్గా క్యాపింగ్ చేకపోవడం, డైలీ కెపాసిటీకి మించి వస్తున్న చెత్తతో సమస్య మరింత పెరిగిపోతోంది. ప్రతిరోజు డంపింగ్​యార్డుకు 5 వేల నుంచి 6 వేల టన్నుల చెత్తను వస్తుండగా,1,200 టన్నుల చెత్తను విద్యుత్​తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. మిగతా చెత్త అలాగే పేరుకుపోతుంది. ఉన్న స్థలం సరిపోక కొత్తగా కార్మిక నగర్​లో చెత్త డంపింగ్ చేస్తున్నారు. 
 

కెపాసిటీ సరిపోక..
జవహర్​నగర్​వద్ద డంపింగ్ యార్డు నిర్వహణ పనులు స్టార్ట్ చేసినప్పుడు గ్రేటర్​సిటీ నుంచి డైలీ 2,500 నుంచి 3 వేల టన్నుల చెత్త వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 5 వేల నుంచి 6,500 టన్నుల చెత్త వస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న చెత్త, అడుగడుగునా నిర్వహణ లోపాలతో చెత్తను బహిరంగంగా పడేస్తున్నారు. ఇప్పటికే యార్డులో14 మిలియన్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అధికారులు సైతం డంపింగ్​యార్డుపై ఒత్తిడి పెరిగిందని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా మరో రెండు యార్డులు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతున్నారు. కొన్నేండ్లుగా ప్రభుత్వం కొత్తవి ఏర్పాటు చేస్తామని చెబుతున్నప్పటికీ ప్రారంభించడం లేదు. 

ఆ 2 మున్సిపాలిటీల పరిధిలో..

డంపింగ్ యార్డు చుట్టూ ఉండే ప్రజలు శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాల నిర్వహణలోని లోపాలతో తమ బతుకులు ఆగమవుతున్నాయని లబోదిబోమంటున్నారు. రోజురోజుకు సమస్యలు మరింత పెరుగుతున్నాయని వాపోతున్నారు. దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల పరిధిలోని సీఎన్ఆర్ కాలనీ, అంజనాద్రి కాలనీ, అంజనాద్రి ఎక్స్ టెన్షన్, ఎంఎల్ఆర్ కాలనీ, సాయి శ్రీనివాస కాలనీల్లోకి డంపింగ్ యార్డు నుంచి మురుగునీరు వస్తోంది. దీంతో నీటి కుంటలు, చెరువులు, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. బోర్ల నీళ్లు తాగాలంటే భయంగా ఉందని, ప్రభుత్వం కనీసం వాటర్ ట్యాంకర్లు అయినా పంపించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల వాసులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.

ఎన్​జీటీ ఆదేశాలు ​బేఖాతరు
2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్​జీటీ) ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడంలేదు. డంపింగ్ యార్డులోని 80 శాతం చెత్తను క్లియర్​చేసి మిగిలిన 20 శాతం చెత్తను రీసైక్లింగ్ చేయాలని చెప్పినా దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డంపింగ్ ను తగ్గించకపోగా రోజురోజుకు మరింత పెంచుతున్నారు. 

బల్దియా హెడ్డాఫీసు ముట్టడికి పిలుపు
జవహర్​నగర్​డంపింగ్​యార్డు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పార్టీలకు అతీతంగా త్వరలో పోరాటానికి పిలుపునివ్వనున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నేతలు కూడా పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. త్వరలో అంతా కలిసి ముందుగా జీహెచ్ఎంసీ హెడ్డాఫీసును ముట్టడించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

లోపల ఏం జరుగుతున్నదో
డంపింగ్ యార్డు చుట్టుపక్కల జనం రోగాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డంపింగ్ యార్డు లోపల ఏం జరుగుతుందో బయటికి తెలుస్తలే.  కనీసం ఎన్​జీటీ ఆర్డర్లనూ కూడా పాటించడం లేదు.  – శాంతిరెడ్డి, దమ్మాయిగూడ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్

ఇండ్లు వదిలి పోవాల్సిన పరిస్థితి
డంపింగ్ ​యార్డు కంపుతో చుట్టు పక్కల జనం ఇండ్ల తలుపులు కూడా తెరవలేకపోతున్నారు. గాలికి వస్తున్న ప్లాస్టిక్​ కవర్లు, చెత్త నుంచి కారుతున్న మురుగు నీరు చెరువులు, కుంటల్లోకి చేరుతున్నాయి. వానలకు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దోమలు, ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకపోతే  అందరూ ఇండ్లు ఖాళీచేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. – రంగుల శంకర్, జవహర్ నగర్ కార్పొరేషన్ బీజేపీ ప్రెసిండెంట్