
- ఇయ్యాల్టి నుంచి వివిధ దేశాలకు అమెరికా టారిఫ్ లేఖలు
- రోజూ పది దేశాలకు పంపుతామన్న ట్రంప్
వాషింగ్టన్:అమెరికాకు వివిధ వస్తువులను ఎగుమతి చేసే దేశాలపై ఎంత మొత్తంలో టారిఫ్‌లు వేస్తామన్నది తెలియజేస్తూ ఆయా దేశాలకు లేఖలు పంపుతామని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోని దేశాలు తమపై ఎంత మొత్తంలో టారిఫ్‌లు వేస్తే తామూ అంతే మొత్తంలో లేదంటే మరింత ఎక్కువగా టారిఫ్‌లు వేస్తామని ఆయన ఇదివరకే వెల్లడించారు.
దీనిపై ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాలు 170కిపైనే ఉన్నాయి. ఆయా దేశాలు ఎంత టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందన్నది తెలియజేస్తూ, రోజూ పది దేశాలకు చొప్పున లెటర్లు పంపుతాం” అని ట్రంప్ చెప్పారు. ఆయా దేశాలు తమతో మంచి డీల్స్ కుదుర్చుకోవచ్చని, కానీ ఇది చాలా క్లిష్టమైన విషయమన్నారు.
ఒక్కో దేశంపై యావరేజ్‌గా 20 నుంచి 30 శాతం టారిఫ్‌లు వేస్తున్నామని చెప్పారు. చైనా, వియత్నాంతోపాటు భారత్ తో త్వరలో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఇండియా మార్కెట్లోకి అమెరికా కంపెనీలు ప్రవేశించేందుకు అనుగుణంగా డీల్ ఉంటుందన్నారు.
కాగా, థాయ్‌లాండ్‌పై 36%, ఇండోనేసియాపై 32%, జపాన్‌పై 24% ప్రతీకార సుంకాలను విధిస్తామన్నారు. అలాగే సౌత్ కొరియాపై 25%, మలేసియాపై 24%, యూరోపియన్ యూనియన్ పై 20%, తైవాన్ పై 32% టారిఫ్ లు వేస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు.