
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ రిపేర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే జూరాల ప్రాజెక్ట్‌ను సందర్శించి, రిపేర్లపై స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం జూరాల ప్రాజెక్ట్‌ను సందర్శించి, రూప్ వైర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ వివరాలను ఆఫీసర్ల ద్వారా తెలుసుకున్నారు. గేట్లకు రిపేర్లు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలతో కలిసి ప్రాజెక్ట్‌పై నిరసన తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జూరాల గేట్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గేట్ల రిపేర్ల విషయంలో మంత్రులు, ఆఫీసర్లు వాస్తవాలను దాచిపెడుతున్నారని మండిపడ్డారు. సీఎం వెంటనే ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్వహణ, క్రస్ట్ గేట్ల రిపేర్ల విషయంలో ఆఫీసర్ల నిర్లక్ష్యం కనబడుతోందన్నారు.
వాహనాల రాకపోకల కోసం బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేయడం హర్షించదగిన విషయమని, కానీ కాగితాలకే పరిమితం కాకుండా నిధులు త్వరగా విడుదల చేసి పనులు ప్రారంభించాలని కోరారు. ఆయన వెంట ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, ఆంజనేయులు, ఎండి జబ్బార్, మహబూబ్, బాల్‌రెడ్డి, గోపి, ఉప్పెర్ నరసింహ, దేవదాస్, పరంజ్యోతి పాల్గొన్నారు.