అడుగంటిన అడవిలో ఆశల చిగుర్లు..! కాగజ్‎నగర్‎లో అక్రమంగా పోడు చేస్తున్న 2 వేల ఎకరాలు వెనక్కి

అడుగంటిన అడవిలో  ఆశల చిగుర్లు..! కాగజ్‎నగర్‎లో అక్రమంగా పోడు చేస్తున్న 2 వేల ఎకరాలు వెనక్కి
  • గిరిజన, గిరిజనేతర రైతులను ఒప్పించి తీసుకుంటున్న అటవీ అధికారులు 
  • వెయ్యి ఎకరాల్లో అటవీ శాఖ ప్లాంటేషన్‌
  • 400 ఎకరాల్లో ఏపుగా పెరిగిన చెట్లు
  • నాడు ఎడారిలా కనిపించిన చోటే నేడు పచ్చదనం

ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌, వెలుగు: కొన్ని నెలల కిందటి వరకు వెలవెలబోయిన ఆ భూములు, ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.. గిరిజనులు, గిరిజనేతరులు అక్రమంగా ఆక్రమించి పోడుచేసిన భూములను వెనక్కి తీసుకుంటున్న అటవీశాఖ, అందులో మొక్కలు నాటి పెంచుతోంది..  మొదట్లో అడ్డుచెప్పిన రైతులు, క్రమంగా సహకరిస్తుండడంతో అడవికి పూర్వరూపం వస్తోంది.  

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలోని సిర్పూర్‌ టి రేంజ్‌ ఇటికలపహాడ్‌ బీట్‌లో రెండు వేల ఎకరాలను గిరిజనేతరుల నుంచి వెనక్కి తీసుకున్న అటవీ అధికారులు, అందులో వెయ్యి ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేశారు. ఇందులో 400 ఎకరాల్లో చెట్లు ఏపుగా పెరగడంతో పచ్చదనం వెల్లివిరుస్తోంది. 

పులుల రాకపోకలకు ‘కీ’ పాయింట్

కాగజ్‌నగర్‌ అడవులు జీవవైవిధ్యానికి నెలవు. అరుదైన వన్యప్రాణులు, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే పెద్దపులులకు ఇది కారిడార్​లా మారింది.  మహారాష్ట్రలోని తాడోబా, అంధేరి టైగర్‌ రిజర్వ్‌ నుంచి వచ్చే పులుల సంతానోత్పత్తికి ఈ ప్రాంతం కీలకంగా ఉంది. ఈ కారిడార్​లోనే  పలు పులులు  పిల్లలకు జన్మనిచ్చాయి.  గత పదేళ్లుగా  పులుల రాకపోకలు మరింత పెరిగాయి. ముఖ్యంగా  ఇటికలపహాడ్‌ ఏరియాలో శాకాహార జంతువులు, సహజ ఊటలు ఉండడంతో  పులుల నివాసం, సంచారం ఎక్కువగా ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు.

 కానీ కొన్నేండ్లుగా గిరిజనులు, గిరిజనేతరులు ఇక్కడి అడవులను నరికి పోడు చేస్తున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం అటవీ ప్రాంతంలో గిరిజనులు తప్ప గిరిజనేతరులు స్థిర నివాసం ఏర్పాటుచేసుకోవడం గానీ, వ్యవసాయం చేయడం గానీచేయరాదు. అదీగాక పోడు చేయడం పూర్తిగా నిషేధం. కానీ  సిర్పూర్‌ టి మండలంలోని ఇటికలపహాడ్‌ ఏరియాలో గిరిజనేతరులు భారీ మొత్తంలో చెట్లు నరికి పోడు చేశారు.  దీని వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా పులుల సంచారానికి ఇబ్బంది కలుగుతోంది. 

ఈ క్రమంలోనే గడిచిన ఐదేండ్లుగా అటవీ శాఖ అధికారులు భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. ఏడాదిన్నర నుంచి ఈ ప్రక్రియ స్పీడ్​అందుకుంది. పోడు భూములు తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో గిరిజనేతరులతోపాటు గిరిజనుల నుంచి కూడా అడ్డంకులు ఎదురయ్యాయి.  కానీ ఫారెస్ట్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు సమన్వయంతో ఎట్టకేలకు రైతులను ఒప్పించారు. మొత్తం 2వేల ఎకరాల్లో ఇప్పటివరకు వెయ్యి ఎకరాలను  స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మొక్కలు నాటగా.. 400 ఎకరాల్లో 15 నుంచి 20 ఫీట్ల ఎత్తు పెరిగాయి. దీంతో అడవికి పునరుజ్జీవం వచ్చినట్లయింది.

అడవిని పునరుద్ధరిస్తున్నాం 

ఇటికలపహాడ్‌లో ఆక్రమణకు గురైన రెండు వేల ఎకరాల పోడు భూమిలో వెయ్యి ఎకరాల్లో అడవిని పెంచేందుకు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. దీని వల్ల ఫారెస్ట్ ఎకోలాజికల్‌ సిస్టమ్‌ మెరుగైంది. అటవీ శాఖ నిబంధనల మేరకు పోడు భూములను వెనక్కి తీసుకొని అడవులు పునరుద్ధరిస్తున్నాం. ఇందుకు రైతులు సైతం సహకరించారు. రైతులకు అన్యాయం చేయకుండా రీ ట్రైవ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాం.     - సుశాంత్‌‌ సుఖ్‌‌దేవ్‌‌ బోబడే, ఎఫ్‌‌డీవో, కాగజ్‌‌నగర్‌‌