మూడు హాస్పిటల్స్‌ తిరిగినా చేర్చుకోలే..

మూడు హాస్పిటల్స్‌ తిరిగినా చేర్చుకోలే..
  • కరోనాతో చనిపోయిన 18 ఏళ్ల డయాబెటిస్‌ పేషెంట్‌
  • బెంగాల్‌లో ఘటన

కోల్‌కతా: కరోనా భయంతో లోకంలోని మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కోల్‌కతాలో 18 ఏళ్ల కరోనా పేషంట్‌ను మూడు ఆసుపత్రులు చేర్చుకోకపోవడంతో పరిస్థితి విషమించి ఆ యువకుడు చనిపోయాడు. ఆ యువకుడికి డయాబెటిస్‌ కూడా ఉండటంతో పరిస్థితి విషమించి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కోల్‌కతాకు చెందిన శుభ్రజిత్‌ ఛటోపాధ్యాయ ఇంటర్‌‌ చదువుతున్నాడు.చిన్న వయసులోనే అతనికి డయాబెటిస్‌ కూడా ఎటాక్‌ అయింది. కాగా.. ఆ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే మూడు ఆసుపత్రుల్లో అతన్ని చేర్చుకోలేదు. చివరికి కోల్‌కతా మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌(కేఎమ్‌సీహెచ్‌)లో చేర్పించినా వాళ్లు కూడా ట్రీట్‌మెంట్‌ ఇవ్వలేదని, పేషంట్‌ తల్లి ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించిన తర్వాత ట్రీట్‌మెంట్ మొదలు పెట్టారని బాధితుడి తండ్రి చెప్పారు. “ సుభ్రజిత్‌ జువెనైల్‌ డయాబెటిస్ పేషెంట్‌. శుక్రవారం పొద్దున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. కమర్‌‌హటీలోని ఈఎస్ఐ హాస్పిటల్‌ ఐసీయూలో బెడ్లు లేవని చెప్పి చేర్చుకోలేదు. ఆ తర్వాత ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌కి తీసుకెళ్లాం. అక్కడా చేర్చుకోలేదు. ఆ తర్వాత కరోనా టెస్టు చేయగా.. రిజల్ట్‌ పాజిటివ్‌ వచ్చింది. పరిస్థితి విషమించి చనిపోయాడు” అని బాధితుడి తండ్రి చెప్పాడు. కేఎమ్‌సీహెచ్‌ హాస్పిటల్‌లో కూడా ట్రీట్‌మెంట్‌ ఇవ్వకుండా ఆలస్యం చేశారని, కరోనా వచ్చినా కూడా వేరే ఏదో వార్డులో ఉంచారని ఆయన అన్నారు. ఆ తర్వాత తన కొడుకు చనిపోయినట్లు చెప్పారని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, విచారణకు ఆదేశించామని అన్నారు.