అమ్మానాన్నా.. నేను చదవలేను.. రాజస్థాన్​లో మరో స్టూడెంట్ ​ఆత్మహత్య

అమ్మానాన్నా.. నేను చదవలేను..  రాజస్థాన్​లో మరో స్టూడెంట్ ​ఆత్మహత్య

కోట: పోటీ పరీక్షలకు పేరు గాంచిన రాజస్థాన్ లోని కోటలో స్టూడెంట్స్ ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జేఈఈ  పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి  సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుంది. కోటలోని బొర్ ఖేడా ప్రాంతానికి చెందిన 18 ఏండ్ల నిహారిక సింగ్ 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్ లో  జేఈఈ కోచింగ్ తీసుకుంటోంది. పరీక్షల ఒత్తిడిని భరించలేక తన ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఘటన స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ‘‘అమ్మా, నాన్న.. నేను జేఈఈ చదవలేను. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను. నేను ఓడిపోయాను. దయచేసి నన్ను క్షమించండి” అని అందులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. జేఈఈ పరీక్ష జనవరి 31న రాయాల్సి ఉండగా ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యలను తగ్గించేందుకు కొత్త ప్రోగ్రామ్

కోటలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుండటంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ గోస్వామి ‘కమ్యాబ్ కోట’ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రతి శుక్రవారం హాస్టల్ లోని విద్యార్థులతో డిన్నర్ చేస్తూ వారితో ముచ్చటిస్తారు. జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు. స్టూడెంట్స్ సూసైడ్ రేట్లను తగ్గించడంలో భాగంగా కోట జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ‘కమ్యాబ్ కోటా’ లో భాగంగా రిపబ్లిక్ డే నాడు కలెక్టర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ తో కలిసి డిన్నర్ చేశారు.