ప్రజాభవన్​లో ప్రజావాణికి 1869 ఫిర్యాదులు

ప్రజాభవన్​లో ప్రజావాణికి 1869 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు :  బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 1,869 ఫిర్యాదులు వచ్చాయి. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి పాల్గొని జనంతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కారణాలతో ఆర్టీసీలో డ్రైవర్లుగా, కండెక్టర్లుగా, మెకానిక్​లుగా, సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహించిన 1300 మందిని గత ప్రభుత్వం డిస్మిస్​ చేసిందని, అందరికీ తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని పలువురు చిన్నారెడ్డిని వేడుకున్నారు. టీఎస్​పీఎస్సీలో ఆరేండ్లుగా పెండింగ్​లో ఉన్న పారామెడికల్​ ల్యాబ్ ​టెక్నిషియన్స్​ఉద్యోగాల తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని జి.విజయ్​కుమార్ అనే వ్యక్తి కోరాడు. హౌస్​కీపింగ్​పనులు చేసే తమకు సాయినాథ్​ఏజెన్సీ 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని 100 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్​జిల్లా గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న పార్ట్​టైం, శానిటేషన్​సిబ్బందికి 10 నెలలుగా జీతాలు ఇవ్వలేదని జిల్లా గిరిజన సంక్షేమశాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఐదేండ్లకోసారి వేతనంలో 25 శాతం పెంచాలని పలువురు అంగన్ వాడీలు కోరారు. ఘట్​కేసర్​మండలం నారపల్లికి చెందిన దాసమ్మ అనే మహిళ ప్రజాభవన్​నుంచి బయటకు వస్తున్న మంత్రి సీతక్క కాళ్లపై పడింది. తనకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారని, వారికి ఉద్యోగం ఇప్పించాలని, 

డబుల్​బెడ్​రూమ్​ ఇల్లు కోసం ఎప్పటి నుంచో తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయింది. న్యాయం చేస్తామని మంత్రి సీతక్క ఆమెకు హామీ ఇచ్చారు. కాగా, యోహోన్ ​సిరిమల్ల అనే యువకుడు ప్రజాభవన్​మీడియా సెంటర్​వద్ద కలకలం సృష్టించాడు. ‘నాది మల్లాపూర్ గ్రామం. కీసర పోలీసులు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఈ విషయం సీఎంతో చెప్పాలి. ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్​లో చనిపోలేదు. చంపేశారు’ అంటూ వాపోయాడు.