ఐఫోన్ల తయారీలో భారత్ రికార్డ్.. 78 శాతం ఫోన్లు అమెరికాకే..

ఐఫోన్ల తయారీలో భారత్ రికార్డ్.. 78 శాతం ఫోన్లు అమెరికాకే..

ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిలో భారత్‌ కొత్త మైలురాయిని అందుకుంది. 2025 మొదటి ఆరు నెలల్లో భారత్ తన ఐఫోన్ ఉత్పత్తి, ఎగుమతును ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు గణనీయంగా పెంచాల్సి వచ్చింది. 2017లో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల అసెంబ్లింగ్‌ను ప్రారంభించినప్పటి నుంచి.. 2025 మొదటి అర్ధభాగంలో ఆపిల్ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. చైనా దిగుమతులపై అధికంగా అమెరికా సుంకాల నేపథ్యంలో ఆపిల్ తన గ్లోబల్ ఉత్పత్తిని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన అడుగు.

మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిసిస్ నివేదిక ప్రకారం.. 2025 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తి 53% పెరిగి.. 23.9 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. సైబర్‌మీడియా రీసెర్చ్ నివేదికల ప్రకారం.. ఐఫోన్ ఎగుమతుల పరిమాణం H1 2025లో 22.88 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది 15.05 మిలియన్ల నుంచి 52% పెరుగుదలను సూచిస్తుంది. విలువ పరంగా చూస్తే.. 2025 మొదటి అర్ధభాగంలో ఆపిల్ ఇండియాలో నుంచి 22.56 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ఇది గత ఏడాది 14.71 బిలియన్ డాలర్ల కంటే గణనీయమైన పెరుగుదల ఉంది.

భారత్ నుంచి ఎగుమతి చేయబడిన ఐఫోన్‌లలో సుమారు 78% అమెరికా మార్కెట్‌కు వెళ్లాయి. దీంతో ఆపిల్ అమెరికన్ అమ్మకాలకు ఇండియా కీలక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేస్తుంది. ఏప్రిల్ 2025లో, భారతదేశం మొదటిసారిగా చైనాను అధిగమించి నెలకు 3.3 మిలియన్ యూనిట్లతో అమెరికాకు ఐఫోన్లను ఎగుమతి చేసింది. చైనా నుంచి కేవలం 9లక్షల ఫోన్లు మాత్రమే అమెరికాకు ఎగుమతి అయ్యాయి.

దేశంలో ఐఫోన్‌ల తయారీలో ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫాక్స్‌కాన్ భారతదేశ ఐఫోన్ ఎగుమతులలో సగానికి పైగా వాటాను కలిగి ఉంది. దీనికి తమిళనాడు, బెంగళూరులో కొత్త యూనిట్లతో తన ఉత్పత్తి సామర్థ్యాలను విస్తరించింది. ఇక టాటా ఎలక్ట్రానిక్స్ కూడా గణనీయంగా తన వాటాను పెంచుకుంది, H1 2025లో భారతదేశంలో ఉత్పత్తి అయిన ఐఫోన్‌లలో 37% టాటానే తయారు చేసింది. ఈ సంఖ్య 2024లో 13% కంటే మూడింతల పెరుగుదలను ప్రస్తుతం కలిగి ఉంది.

ఆపిల్ తన సరఫరా గొలుసును మరింత బలోపేతం చేయడానికి ఐఫోన్ 17ని చైనా, భారతదేశం రెండింటిలోనూ ఏకకాలంలో తయారు చేయాలని చూస్తోంది. ఫాక్స్‌కాన్ తమిళనాడు ప్లాంట్‌లో ఇప్పటికే ట్రయల్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఉత్పత్తి వ్యూహం స్థితిస్థాపకతను మెరుగుపరచడమే కాకుండా.. ఐఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి పట్టే సమయాన్ని కూడా తగ్గిస్తుంది. మొత్తంగా ఆపిల్ 2025లో భారతదేశంలో 60 మిలియన్ ఐఫోన్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం 42 మిలియన్ల కంటే ఇది పెద్ద టార్గెట్ అని చెప్పుకోవాలి. 

ఈ వృద్ధికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్‌లను అమెరికాలోనే తయారు చేయాలని.. లేకపోతే 25% సుంకాన్ని విధిస్తామని హెచ్చరించడం ఆపిల్ కు ఒక సవాలుగా నిలుస్తుంది. ఇదే సమయంలో మరోపక్క చైనా తన ఇంజనీర్లను భారతీయ ఫాక్స్‌కాన్ ప్లాంట్ల నుంచి తిరిగి వెనక్కి తీసుకెళ్లటం ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఏదేమైనా ఆపిల్ భారతదేశాన్ని తన గ్లోబల్ సరఫరా గొలుసులో ఒక కీలక కేంద్రంగా మార్చడానికి కట్టుబడి ఉంది. ఈ అభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలో  కీలక ఆటగాళ్ల లిస్టులో చేర్చనుంది.