
- ఏడుగురి అరెస్ట్
చండీగఢ్ : హర్యానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందారు. యమునానగర్, అంబాలా జిల్లాల్లోని మందేబరి, పంజెతో కామజ్రా, పూస్‌ఘర్, సరన్ గ్రామాల్లో ఈ కల్తీ మద్యం మరణాలు సంభవించాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. లిక్కర్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కలకలం సృష్టించడంతో విచారణ కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కాంగ్రెస్, బీజేపీ నేతల కొడుకులు కూడా ఉన్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఓ నిషేధిత ఫ్యాక్టరీలో దాచిన సుమారు 200 మద్యం డబ్బాలను సీజ్ చేశారు. కల్తీ లిక్కర్ తయారీకి వాడిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.